ఏకంగా ఫేక్ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు: డబ్బులే డబ్బులు, 8 నెలలు, దొరికేశారిలా!
పాట్నా: మోసగాళ్లు డబ్బు సంపాదించేందుకు కొత్త కొత్త దారులు వెదుకుతున్నారు. తాజాగా, ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రజల వద్ద డబ్బులు గుంజుతున్న ఓ ముఠాను బీహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని బంకాలో చోటు చేసుకుంది. ఆ నకిలీ పోలీస్టేషన్ కూడా పట్టణ పోలీస్ స్టేషన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నివాసానికి కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం.

ఏకంగా 8 నెలలపాటు నకిలీ పోలీస్ స్టేషన్ విజయవంతం
బంకాలో నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఈ ముఠా.. సుమారు 8 నెలల నుంచి ఎలాంటి అటంకాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించడం గమనార్హం. డజన్ల కొద్ది నకిలీ పోలీసులతోపాటు సబ్ ఇన్‌స్పెక్టర్, డీఎస్పీలు కూడా ఈ పోలీస్ స్టేషన్‌లో యూనిఫాంలోనే విధులు నిర్వహిస్తున్నారు. అయితే, పట్టణ ఎస్‌హెచ్ఓ శంభు యాదవ్ బుధవారం సాయంత్రం పోలీస్ యూనిఫాంలో ఉన్న ఓ మహిళా, ఓ పురుడుని చూశాడు. అయితే, వారి వద్ద అధికారిక తుపాకీ బదులు.. నాటు తుపాకీ ఉంది. దీంతో ఈ నకిలీ ముఠా గుట్టురట్టయింది.

నకిలీ పీఎస్‌లో ఎస్‌హెచ్ఓ నుంచి డీఎఎస్పీ వరకు ఫేక్
ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నకిలీ పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్న నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. ఐదుగురు నిందితులు అనితా ముర్ము, ఆకాశ్ మాంఝీ, రమేష్ కుమార్, వకీల్ కుమార్, జూలీ కుమారి మాంఝీలను అరెస్ట్ చేసినట్లు బంకా ఎస్పీ సత్యప్రకాశ్ వెల్లడించారు. అనురాగ్ అనే వ్యక్తికి చెందిన గెస్ట్ హౌస్‌ను నిందితులు పోలీస్ స్టేషన్‌గా మార్చారని ఎస్పీ తెలిపారు. దీంతో స్థానికులంతా ఇది నిజమైన పోలీస్ స్టేషన్ అని నమ్మారు. అనితా దేవి ముర్ము యూనిఫాం వేసుకుని ఎస్‌హెచ్ఓగా చలామణి కాగా, ఆకాశ్ కుమార్ మాంఝీ.. బ్యాడ్జీలు పెట్టుకుని డీఎస్పీగా అవతారం ఎత్తాడు. అయితే, వీరివద్ద నాటు తుపాకులు మాత్రమే ఉన్నాయి.

పరారీలో ప్రధాన నిందితుడు భోళా యాదవ్
నిందితుల వద్ద నుంచి పోలీసులు నాటు తుపాకులను, పోలీస్ యూనిఫాంలను, 500 పీఎం అవాస్ యోజన అప్లికేషన్ ఫాంలు, 40 ఎలక్టోరల్ కార్డులు, బ్యాంక్ చెక్కులు, ఐదు మొబైల్ ఫోన్లు, బంకా జిల్లా ప్రెసిడెంట్ అల్కా కుమారి సీల్, నకిలీ ఐడెంటిటీ కార్డులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ ముఠా నాయకుడు భోళా యదవ్ అలియాస్ ముఖియా పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఇక గెస్ట్ హౌస్ మేనేజర్ హేమన్ మిశ్రా, అల్కా కుమారీల పాత్రపైనా తాము దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఉద్యోగాలు ఇస్తామని, వివిధ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి భోలా యాదవ్ ముఠా ప్రజలను మోసం చేసిందని చెప్పారు.

పాట్నాలోనూ ఫేక్ ఎస్కార్ట్ పోలీస్ టీం..
అంతేగాక, బీహార్ రాజధాని పాట్నాల్లో ఓ ఎస్కార్ట్ పోలీస్ టీంను కూడా భోళా యాదవ్ ఏర్పాటు చేశారని తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. పోలీసు, ఇతర శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువత, ప్రజల వద్ద భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. పలువురిని ఇలా ఫేక్ పోలీస్ స్టేషన్లలో ఉద్యోగాలిచ్చారన్నారు. విచారణ పేరుతో ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి కూడా డబ్బులు వసూలు చేశారని తెలిపారు.

డబ్బులు తీసుకుని ఫేక్ పీఎస్‌లో ఉద్యోగాలు
భోళా యాదవ్‌కు ఉద్యోగాల కోసం తాము రూ. 90 వేలు, 55 వేలు ఇచ్చామని అనిత, జూలీ తెలిపారు. కాగా, వీరిని నకిలీ పోలీస్ స్టేషన్‌లో నియమించాడు. అయితే, తాము నకిలీ పోలీసు ఉద్యోగంలో చేరామని విషయం కూడా అనిత, జూలీలకు తెలియకపోవడం గమనార్హం. పోలీసు విభాగం ద్వారానే తాము నియామకమయ్యామని ఈ ఇద్దరు భావిస్తున్నారని ఎస్పీ తెలిపారు. నిందితులను సమగ్రంగా విచారిస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications