భయపెడుతున్న కరోనా.. భారత్‌లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే ?
కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. భారత్ లో సైతం ఇప్పుడు కేసులు పెరుగుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కొవిడ్ కేసులపై దృష్టి సారించింది. కొవిడ్ నియంత్రణలోనే ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు లెక్కలు చెప్తున్నాయి. వీటిలో కేరళ - 69, మహారాష్ట్ర - 44, తమిళనాడు - 34 కేసులు ఉన్నట్టు ప్రకటించారు. ఈ కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నామని.. ఎప్పటికప్పుడు ఆరా తీసున్నామని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు బంధువు, నటి శిల్పా శిరోద్కర్.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే.

ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన పలు శాఖల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR) విభాగం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు కోవిడ్ పరిస్థితులపై సమీక్షించారు.
కోవిడ్-19 JN 1 వేరియంట్ కారణంగా రోగులకు జ్వరం, అలసట, తలనొప్పి గొంతు నొప్పి ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్నకొత్త వేరియంట్‌లు.. గతంలో ఉన్న వాటి కంటే ఎక్కువ వ్యాప్తి చెందేలా లేవని అంటున్నారు.
మరోవైపు ఆసియా దేశాలైన హాంగ్‌కాంగ్, సింగపూర్ లలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కారణంగా ఆస్పత్రి బాట పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హాంకాంగ్‌లో ఇటీవల నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఏడాదిలో అత్యధిక స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మరణాలు సంఖ్య కూడా ఈ ఏడాదిలోనే గరిష్టంగా 31కి చేరుకున్నట్లు వాపోతున్నారు. అటు సింగపూర్ లో కూడా కొవిడ్ కేసుల పెరుగుదలతో అలర్ట్ జారీ చేశారు. మే 3వ తేదీ నాటికి అంచనా వేసిన కేసుల సంఖ్య కంటే 28 శాతం పెరిగి పాజిటివ్ కేసుల సంఖ్య 14,200కు చేరుకున్నట్లు సమాచారం. నిత్యం ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య కూడా దాదాపు 30 శాతం పెరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications