యెడ్డీ కుమారుడి గెలుపు, బీహార్‌లో లాలూ ఖుషీ
న్యూఢిల్లీ: కర్ణాటకలోని మూడు శాసనసభా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర షికారిపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. యెడ్యూరప్ప షిమోగా నుంచి లోకసభకు ఎన్నిక కావడంతో ఆ సీటు ఖాళీ అయింది. దాంతో ఉప ఎన్నిక జరిగింది. దేశంలోని 18 శాసనసభా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కర్ణాటకలోని బళ్లారిలో కాంగ్రెసు విజయం సాధించింది. కాంగ్రెసు అభ్యర్థి గొపాలకృష్ణ బిజెపి అభ్యర్థి ఓబులేష్‌పై 25 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదే విధంగా పంజాబ్ పాటియాల స్థానం కూడా కాంగ్రెసు వశమైంది. కాంగ్రెసుకు చెందిన ప్రణీత్ కౌర్ 23 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
బీహార్‌లోని చాప్రా నియోజకవర్గంలో లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జెడి ఆభ్యర్థి రణదీర్ కుమార్ సింగ్ విజయం సాధించారు. ఆర్జెడితో కలిసి పోటీ చేసిన నితీష్ కుమార్ నాయకత్వంలోని జెడి (యు) అభ్యర్థి రిషి మిశ్రా జాలే సీటు నుంచి విజయం సాధించారు. బీహార్‌లోని మోహనియా సీటులో బిజెపి అభ్యర్థి నిరంజన్ రామ్ విజయం సాధించారు. బాంకాలో కూడా బిజెపి అభ్యర్థి విజయం సాధించారు. నిరంజన్ రామ్ గెలుపు సాధించారు. ఆర్జెడీ - జెడియు కూటమి బీహార్‌లో పది సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే ఆరు సీట్లను గెలుచుకుంది. బిెజెపికి నాలుగు సీట్లు దక్కాయి.
బీహార్‌లోని ఉప ఎన్నికల ఫలితాలు తమ ఊహలకు అతీతంగా వచ్చాయని, తాము ఈ ఫలితాలను ఊహించలేదని, ఆర్జెడీ - జెడి(యు) ఓటు బ్యాంకును కూడా కొల్లగొడుతామని భావించామని బిజెపి నాయుకుడు షానవాజ్ హుస్సేన్ అన్నారు. మోడీ ప్రభుత్వానికి ఈ ఫలితాలకు సంబంధం లేదని, రాష్ట్ర పార్టీ వైఫల్యం కారణంగానే ఫలితాలు సరిగా సాధించలేకపోయామని ఆయన అన్నారు.తాము పూర్తిగా సన్నద్ధం కాలేదని, సన్నద్ధమై ఉంటే పదికి పది సీట్లు గెలుచుకుని ఉండేవాళ్లమని జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ అన్నారు.
కాగా, పంజాబ్‌లోని తల్వండీ సాబో సీటు నుంచి శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి జీత్ మోహిందర్ సింగ్ విజయం సాధించారు.
బీహార్‌లో పది స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మూడేసి స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. పంజాబ్‌లో రెండు స్థానాలకు జరిగాయి. బీహార్‌లో లాలూ, నితీష్ పొత్తుకు ఈ ఉప ఎన్నికలు అగ్నిపరీక్ష కానున్నాయి. బీహార్ ఉప ఎన్నికల ఫలితాల పట్ల ఆర్జెడి అధినేత లాలూ ప్రసాధ్ ఆనందంగా ఉన్నారు.

బీహార్‌లోని హజీపూర్, చాప్రా, మొహియుద్దీన్‌నగర్, పర్బట్ట, భాగల్పూర్, రాజ్‌నగర్ (ఎస్‌సి), జాలే, మోహానియా, నర్కటియాగంజ్, బంకా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీహార్‌లో పది స్థానాలకు చాలా తక్కువగా 46.42 శాతం పోలింగ్ మాత్రమే జరిగింది.
కర్ణాటకలోని మూడు శాసనసభా స్థానాలకు 72 శాతం పోలింగ్ జరగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 3 స్థానాలకు 70 శాతం పోలింగ్ జరిగింది. పంజాబ్‌లోని రెండు సీట్లకు 66 శాతం పోలింగ్ జరిగింది.












Click it and Unblock the Notifications