maharashtra delhi gujarat Coronavirus covid 19 odisha మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ కరోనా వైరస్ కోవిడ్ 19 ఒడిశా
కరోనా సెకండ్ వేవ్ : ఏ రాష్ట్రంలో ఏయే నిబంధనలు... ఆర్టీపీసీఆర్ నెగటివ్ ఏ రాష్ట్రాల్లో తప్పనిసరి..
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ తగ్గుముఖం పట్టిన కేసులు ఒక్కసారిగా మళ్లీ పుంజుకున్నాయి. దీంతో ఆస్పత్రులన్నీ మళ్లీ కరోనా పేషెంట్లతో నిండిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే గతేడాది భారత్ ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు కఠిన నిబంధనలు మళ్లీ అమలులోకి తీసుకొస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా కూడా ఆలోచన చేస్తున్నాయి. ప్రస్తుతం ఏయే రాష్ట్రాల్లో ఎటువంటి నిబంధనలు అమలులో ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం...
గుజరాత్ : ఇతర రాష్ట్రాల నుంచి గుజరాత్ వచ్చే ప్రయాణికులకు కోవిడ్ 19 ఆర్టీ పీసీఆర్ నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు. ఆ సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తారు.

రాజస్తాన్ : పంజాబ్,హర్యానా,మధ్యప్రదేశ్,గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ 19 నెగటివ్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. అలాగైతేనే వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తారు.
ఒడిశా : మహారాష్ట్ర,కేరళ,పంజాబ్,మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఒడిశా ప్రభుత్వం వారం రోజుల పాటు ఐసోలేషన్ తప్పనిసరి చేసింది.
త్రిపుర : కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి త్రిపుర వచ్చే విమాన ప్రయాణికులు అగర్తలా విమానాశ్రయంలో తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలి.
మహారాష్ట్ర : గుజరాత్,ఢిల్లీ ఎన్‌సీఆర్,గోవా,రాజస్తాన్,కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి. పుణేకి వెళ్లే ప్రయాణికులు ఒకవేళ ఆర్టీ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తీసుకెళ్లకపోతే అక్కడి ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
కర్ణాటక : మహారాష్ట్ర,కేరళ నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ 19 నెగటివ్ సర్టిఫికెట్‌ను కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
ఉత్తరాఖండ్ : ఇక్కడికి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్ 19 టెస్టులు తప్పనిసరి. కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్దారణ అయినవారిని క్వారెంటైన్‌కు పంపిస్తారు. ఆర్టీపీసీఆర్,ట్రూనాట్,సీబీనాట్,యాంటీజెన్ కరోనా నెగటివ్ సర్టిఫికెట్ చూపించినవారికి క్వారెంటైన్ మినహాయింపు ఉంటుంది.
మణిపూర్ : ఫిబ్రవరి 24 నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చే విమాన ప్రయాణికులందరికీ ఇక్కడ కోవిడ్ 19 టెస్టు తప్పనిసరి చేశారు.
అసోం : ఇక్కడికి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్ 19 టెస్ట్ తప్పనిసరి. ఒకవేళ కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలితే క్వారెంటైన్‌కు తరలిస్తారు.
ఛత్తీస్‌గఢ్ : మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,ఢిల్లీల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్ట్ తప్పనిసరి చేశారు. ముఖ్యంగా రాయ్‌పూర్,జగ్దల్‌పూర్‌లలో ఈ టెస్టులు తప్పనిసరి.
అండమాన్ నికోబార్ దీవులు : ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్‌ల నుంచి జారీ చేసిన ఆర్టీపీసీఆర్ కరోనా నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఆ సర్టిఫికెట్ 48 గంటల వ్యవధిలో పొందినదై ఉండాలి. ఒకవేళ ఆర్టీపీసీఆర్ నెగటివ్ సర్టిఫికెట్ లేకపోతే వచ్చిన విమానంలోనే వెనక్కి పంపిస్తారు.
బిహార్ : ఆర్టీపీసీఆర్ నెగటివ్ సర్టిఫికెట్‌ను బిహార్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
పశ్చిమ బెంగాల్ : కరోనా లక్షణాలు ఉన్న ప్రయాణికులను సమీపంలోని కోవిడ్ 19 టెస్ట్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు.
తమిళనాడు : కేరళ,మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులకు ఏడు రోజుల హోం క్వారెంటైన్ తప్పనిసరి. ఆ తర్వాత మరో వారం రోజుల పాటు స్వీయ పర్యవేక్షణ అవసరం.