సుప్రీంకు ఎన్‌సీపీఆర్ షాకింగ్ రిపోర్ట్- తక్షణ సాయానికి 10 వేల చిన్నారుల ఎదురుచూపులు
భారత్‌లో కోవిడ్ కల్లోలం నేపథ్యంలో పెద్దవారిపైనే ప్రభావం పడుతుందని అందరూ భావిస్తుండగా.. తల్లితండ్హుల్ని, సంరక్షుల్ని కోల్పోయి అనాథలవుతున్న చిన్నారుల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. ఇలాంటి చిన్నారుల్ని గుర్తించి తక్షణం ఆదుకోవాలని తాజాగా సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఏ చిన్నారీ ఆకలితో బాధపడకూడదని సూచించింది. ఈ నేపథ్యంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుప్రీంకోర్టుకు ఇచ్చిన ఓ రిపోర్ట్ కలకలం రేపుతోంది.
భారత్‌లో కరోనా ఫస్ట్‌వేవ్ తర్వాత, ఇప్పుడు సెకండ్‌వేవ్‌లోనూ భారీగా చిన్నారులు అనాథలవుతున్నారని, వారిని గుర్తించి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్‌సీపీసీఆర్ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇలా తల్లితండ్రుల సంరక్షణ కోల్పోయిన దాదాపు పది వేల మంది చిన్నారులకు తక్షణ సాయం, సంరక్షణ అవసరమని సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఇందులో కరోనా ఫస్ట్‌వేవ్ తర్వాత అదృశ్యమైన, అనాథలైన చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది.

వీరందరినీ గుర్తించి చేరదీయకపోతే వీరు అక్రమ రవాణా, ఇతరత్రా వేధింపుల బారిన పడే ప్రమాదముందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వల్ల అనాథలవుతున్న, సంరక్షణ కోల్పోతున్న చిన్నారులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం సుమోటో కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా తక్షణ సాయం అవసరమైన చిన్నారుల జాబితాను ఎన్‌సీపీసీఆర్ సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీంతో ఈ జాబితాను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం ప్రకటించింది.












Click it and Unblock the Notifications