విదేశాల్లో రాహుల్‌గాంధీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు-బీజేపీ కౌంటర్ ఇదే..!!
న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విదేశీ వేదికపై భారత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 'భారత ప్రజాస్వామ్యంపై పూర్తిగా దాడి చేస్తోంది' అని ఆయన ఆరోపించారు. దీనికి బీజేపీ తీవ్రంగా బదులిచ్చింది, రాహుల్‌ను 'ప్రచార నేత' (Leader of Propaganda) అని విమర్శిస్తూ, మరోసారి విదేశీ వేదికపై భారత ప్రజాస్వామ్యాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారని మండిపడింది.
రాహుల్ గాంధీ ఏమన్నారు?
ప్రస్తుతం నాలుగు రోజుల సౌత్ అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్, విద్యార్థులతో మాట్లాడుతూ దేశంలో నెలకొన్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు."భారతదేశంలో బహుళ మతాలు, సంప్రదాయాలు, భాషలు ఉన్నాయి. భారత్ అంటే ప్రజలందరి మధ్య, వివిధ సంస్కృతులు, మతాలు, ఆలోచనల మధ్య జరిగే ఒక సంభాషణ. ఈ విభిన్న ఆలోచనలు వర్ధిల్లడానికి ఒక చోటు అవసరం. ఆ స్థలాన్ని సృష్టించడానికి ప్రజాస్వామ్య వ్యవస్థే అత్యుత్తమ మార్గం. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై మొత్తంగా దాడి జరుగుతోంది. ఇదే దేశానికి అతిపెద్ద ముప్పు" అని రాహుల్ గాంధీ అన్నారు.

చైనా విధానంతో పోలిక:
భారత రాజకీయ వ్యవస్థను చైనా వ్యవస్థతో పోల్చుతూ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజలను అణచివేసే నిరంకుశ వ్యవస్థను చైనా నడుపుతోందని చెప్పిన రాహుల్...కానీ మనం అలా చేయలేమన్నారు.మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. చైనా మాదిరిగానే మనం కూడా ఉత్పత్తి రంగంలో అభివృద్ధి సాధించగలమా? కానీ అది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే చేయాలని నొక్కి చెప్పారు.అదే మన ముందున్న అతిపెద్ద సవాలని ఆయన స్పష్టం చేశారు.
భయం అనేది బీజేపీ-ఆరెస్సెస్ సిద్ధాంతం
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, హిందూ సిద్ధాంతకర్త వి.డి. సావర్కర్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ, భయమే ఆరెస్సెస్-బీజేపీ సిద్ధాంతం అని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
"బీజేపీ-ఆరెస్సెస్ స్వభావం ఇదే. విదేశాంగ మంత్రి చేసిన ఒక ప్రకటనను గమనించండి,ఆయన 'చైనా మనకంటే ఎంతో శక్తివంతమైంది, వారితో మనం ఎలా గొడవ పడగలం?' అని అన్నారు. ఆ సిద్ధాంతం గుండెకాయలో ఉన్నది భయమే. అదేవిధంగా, సావర్కర్ తన పుస్తకంలో తాను, తన స్నేహితులు ఒక ముస్లిం వ్యక్తిని కొట్టినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందని రాసుకున్నారు. ఐదుగురు కలిసి ఒక బలహీనుడిని కొట్టి సంతోషపడటం అంటే అది పిరికితనమే. బలహీనులను కొట్టడం ఆరెస్సెస్ సిద్ధాంతం" అని రాహుల్ ఆరోపించారు.
బీజేపీ తీవ్ర ఆగ్రహం
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రంగా మండిపడ్డారు."రాహుల్ గాంధీ మరోసారి విదేశాలకు వెళ్లి భారత ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. ఆయన ప్రచార నాయకుడిలా వ్యవహరిస్తున్నారు. ఆయన భారతదేశ వ్యవస్థతో పోరాడాలని చూస్తున్నారు.ఒకసారి అమెరికా,యూకేలు జోక్యం చేసుకోవాలని అడుగుతారు,ఇప్పుడు మరోసారి ఇదే చేశారు.సేన, న్యాయవ్యవస్థ నుంచి రాజ్యాంగం,సనాతనం వరకు అన్నింటిపైనా దాడి చేస్తున్నారు. అని పూనావాలా 'ఎక్స్'వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ నాలుగు రోజుల పాటు దక్షిణ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.ఈ పర్యటన సమయంపై కూడా బీజేపీ ఇప్పటికే ప్రశ్నలు లేవనెత్తింది.












Click it and Unblock the Notifications