వణికిస్తోన్న భారీ వర్షాలు- విమానాలు రద్దు: ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం
ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుఫాన్.. ఉగ్రరూపాన్ని దాల్చింది. గంటగంటకూ బలపడుతోంది. తీరం వైపు దూసుకొస్తోంది. తుఫాన్ ధాటికి మహారాష్ట్ర, గుజరాత్ వణికిపోతున్నాయి. అటు పాకిస్తాన్ తీరంపైనా ఈ తుఫాన్ ప్రభావం పడింది. ఈ నెల 15వ తేదీన ఈ పెను తుఫాన్ తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
సోమవారం తెల్లవారు జామునాటికి గుజరాత్‌లోని పోర్బందర్‌కు నైరుతి దిశగా 330 కిలోమీటర్లు, ద్వారక నగరానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన కనిపించింది ఈ తుఫాన్. గంటకు అయిదు కిలోమీటర్ల వేగంతో గుజరాత్ తీరం వైపు దూసుకెళ్తోంది. ఈ నెల 15వ తేదీ నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గుజరాత్‌లోని జఖావ్ పోర్ట్ వద్ద తీరాన్ని తాకుతుందని తెలిపింది.

దీని ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌లల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. తీర ప్రాంతాలన్నీ పోటెత్తుతున్నాయి. రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. ముంబై, గుజరాత్‌లో నవ్‌సారి జిల్లా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ తీరాన్ని దాటి, బలహీన పడేంత వరకూ మత్స్యకారులెవరూ చేపలవేటకు వెళ్లకూడదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తుఫాన్ గంటగంటకూ తీవ్ర రూపాన్ని దాల్చుతోందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ముంబై సహా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం పలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది. తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలను చేపట్టింది.
ప్రతికూల వాతావరణం ఏర్పడటం వల్ల ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను అధికారులు మూసివేశారు. బలమైన ఈదురుగాలులు వీస్తోండటం, వెలుతురు లేమి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానాలు ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుమతి ఇవ్వట్లేదు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది. ఫలితంగా పలు విమానాలు రద్దయ్యాయి. మరి కొన్నింటిని దారి మళ్లించారు.
తాము నడిపే విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిరిండియా వెల్లడించింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది. మరి కొన్ని విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తాయని వివరించింది. హఠాత్తుగా విమాన సర్వీసులు రద్దు కావడం వల్ల ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు ప్రయాణికులు గంటల కొద్దీ వేచి ఉంటోన్నారు.












Click it and Unblock the Notifications