పొంచివున్న తుఫాను ముప్పు.. రెడ్ అలర్ట్ జారీ!
నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాల ప్రభావంతో ఇది ఏర్పడింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారుతుంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించింది. గురువారం ఉదయానికి ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. తర్వాత మరింత బలపడుతుందని అధికారులు తెలిపారు. మే 25వ తేదీ రాత్రి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది తుఫానుగా మారి ఒడిసా తీరం దిశగా పయనించే అవకాశం కూడా ఉంటుందంటున్నారు.
అధునాతన పరికరాలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లొద్దని, వెళ్లినవారు గురువారం ఉదయానికి వెనక్కి వచ్చేయాలని అధికారులు సూచించారు. రెండురోజులపాటు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. సముద్రంలో అలలు ఎగసిపడతాయని హెచ్చరికలు జారీచేశారు. దీంతో తమిళనాడులోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు. వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు అధునాతన పరికరాలు, 30 హెచ్ పీ పవర్ ఇంజన్ తో ఉన్న ఫైబర్ బోట్లు, రబ్బరు పడవలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కమాండోలను సిద్ధం చేవారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

30న కేరళను తాకే అవకాశం
మే 23 నుంచి 27వ తేదీ మధ్య తుఫాను ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్‌లపై ఉంటుంది. గుజరాత్, ముంబయిలకు మే 28న భారీ వర్ష సూచన చేశారు. కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, తెలంగాణల్లో మే 23 వరకూ ఉరుములు, పిడుగులతో వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసరాలను తాకాయి. తుఫాను ప్రభావం మాల్దీవులు, అరేబియా సముద్రం, కొమరిన్ తోపాటు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. ఈనెల 30వ తేదీనాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి.












Click it and Unblock the Notifications