బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్: ఎల్లో అలర్ట్ జారీ
Fengal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం.. తమిళనాడుపై తీవ్రంగా పడింది. కొన్ని గంటలుగా అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదవుతోంది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో తుఫాన్‌గా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి ఇదివరకే ఫెంగల్ అని పేరు పెట్టింది. ఈ పేరును- సౌదీ అరేబియా సూచించింది. ఈ సీజన్‌లో సంభవించబోతోన్న మూడో తుఫాన్ ఇది.

మంగళవారం రాత్రి 11:30 గంటల సమయానికి ఈ వాయుగుండం దక్షిణ బంగాళాఖాతం- తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగంలో స్థిరంగా కనిపించింది. శ్రీలంకలోని ట్రింకోమలికి ఆగ్నేయ దిశగా 190, తమిళనాడులోని నాగపట్నానికి ఆగ్నేయం- తూర్పు ఆగ్నేయ దిశగా 470, పుదుచ్చేరికి ఆగ్నేయ దిశగా 580, చెన్నైకి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
క్రమంగా ఇది ఆగ్నేయ దిశగా కదులుతుందని, ఈ సాయంత్రానికి తుఫాన్‌గా మారడానికి అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 29వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరిల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. చెన్నైకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తుఫాన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. నాగపట్నం, మైలాడుథురై, కడలూర్, రామనాథపురం, విల్లుపురం, మధురై, తూత్తుకూడి, కన్యాకుమారి జిల్లాలకు జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను తరలించింది.
కాంచీపురం, తిరువళ్లూర్, తిరువారూర్, తంజావూరు, పుదుక్కోట్టై, అరియలూరు, పెరంబలూరు, నీలగిరి, కోయంబత్తూర్, తిరుచ్చి, తెన్‌కాశి, తిరునెల్వేలి.. జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యలో ఆయా జిల్లాలల్లో పాఠశాలలకు సెలవును ప్రకటించింది.
చెన్నైలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. చెన్నై సెంట్రల్, అన్నానగర్, నుంగంబాక్కం, వడపళణి, అంబత్తూర్, బేసిన్ బ్రిడ్జి, అడయార్, షోలింగనూర్, మీనంబాక్కం, ముగళివాక్కం వంట ప్రాంతాల్లో రాత్రంతా వర్షం దంచికొట్టింది.












Click it and Unblock the Notifications