పొంచివున్న పెను తుఫాన్..!!
Cyclone in Arabian Sea: భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న గుజరాత్‌కు మరో గండం పొంచివుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో తుఫాన్‌గా మారబోతోంది. దీని ప్రభావంతో మహారాష్ట్ర కోస్తా, ఉత్తర ప్రాంతాలు సహా గుజరాత్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణం కేంద్రం వెల్లడించింది.
కొద్ది రోజులుగా గుజరాత్‌లో అతి భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. అక్కడి నదులన్నీ వరదపోటుకు గురయ్యాయి. పొంగిపొర్లుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ అసాధారణ వర్షపాతం నమోదవుతూ వస్తోంది. పల్లె, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా జలమయం అయ్యాయి. మూడు రోజుల వ్యవధిలో 28 మంది ఈ భారీ వర్షాలకు బలి అయ్యారు.

దేవభూమి ద్వారకా, రాజ్‌కోట్, జామ్ నగర్, మహీసాగర్, పోర్బందర్, ఖేడా, అహ్మదాబాద్, మోర్బీ, జునాగఢ్, భరూచ్, వడోదర జిల్లాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. 17,800 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వారందరినీ సహాయ, పునరావాస శిబిరాలకు తరలించినట్లు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. ఒక్క వడోదరా జిల్లాలోనే 12,000 మందికి పునరావాసం కల్పించారు.
జామ్‌నగర్ జిల్లాలో రంజిత్ సాగర్ రిజర్వాయర్ గేట్లు గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఫలితంగా అధికారులు గేట్లు ఎత్తేశారు. వరద జలాలను దిగువకు విడుదల చేస్తోన్నారు. అదే సమయంలో విశ్వామిత్రి నది వరద తాకిడికి గురైంది. తీర ప్రాంత ప్రాంతాలను ముంచెత్తింది. గ్రామాలన్నీ జలమయం అయ్యాయి.
వరదల వల్ల పలు చోట్ల చిక్కుకుపోయిన స్థానికులను వైమానిక దళాధికారులు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆయా జిల్లాల్లో సంభవించిన వరద నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
ఈ పరిస్థితుల మధ్య- పులి మీద పుట్రలా గుజరాత్‌కు తుఫాన్ ముప్పు పొంచివుంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో తుఫాన్‌గా మారుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సౌరాష్ట్ర- కఛ్ మధ్య తీరాన్ని దాటుతుందని అంచనావేసింది.
ఈ ఉదయానికి ఈ అల్పపీడనం భుజ్‌కు ఉత్తర-వాయవ్య దిశలో సముద్రంలో 60 కిలో మీటర్లు, నలియాకు ఈశాన్యంగా 80 కిలో మీటర్లు, పాకిస్తాన్‌లోని కరాచీకి తూర్పు-ఆగ్నేయ దిశగా 270 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీనికి ఆస్నా అని పేరు పెట్టారు. ఈ పేరును పాకిస్తాన్ సూచించింది.












Click it and Unblock the Notifications