Navratri Special: దాండియా- గర్భా నృత్యాల్లో తేడా ఏంటి? ఎందుకింత ప్రాముఖ్యత!!
నవరాత్రి వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా- ప్రత్యేకించి గుజరాత్‌లో, ఎంతో ఉత్సాహంగా జరుపుకునే రెండు సంప్రదాయ నృత్యాలు.. గర్బా, దాండియా. రెండూ ఒకేలా కనిపించినా, వాటి శైలి, థీమ్, డివోషన్ లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను చాలామంది గమనించరు. ఈ రెండు సంప్రదాయ నృత్యాల్లో కూడా చుట్టూ తిరుగుతూ.. లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ కనిపిస్తారు యువతీ యువకులు. వాటి మూలాలు, ఉద్దేశ్యాలు చాలా భిన్నమైనవి.
'గర్బా' ఉద్భవించింది ఇలా..
- గర్బా అనే పదం- గర్బో (కుండ)ను ప్రతిబింబిస్తుంది. గర్బో లేదా దుర్గాదేవి విగ్రహం చుట్టూ వృత్తాకారంలో చేసే సంప్రదాయ గుజరాతీ నృత్యం.. గర్భ. 'గర్భదీప్' అనే పదం నుండి 'గర్బా' ఉద్భవించింది. దీనికి "దీపం ఉన్న మట్టి కుండ" అని అర్థం. ఇది సృష్టిని సూచికా భావిస్తారు.
- భక్తి భావంతో కూడిన ఈ నృత్యంలో చేతులు ఆడిస్తూ చప్పట్లు కొట్టడం, సున్నితమైన హావభావాలు, లయబద్ధమైన పాదాల కదలికలు ఉంటాయి. దుర్గాదేవిని స్తుతించే భక్తి పాటలతో ఈ నృత్యం సాగుతుంది. గర్బా సమయంలో మహిళలు ఛనియా చోలీ ధరించగా, పురుషులు కేడియు ధరిస్తారు.

దాండియా ఆడేదిలా..
- నవరాత్రుల్లో ప్రసిద్ధి చెందిన మరొక నృత్యం.. దాండియా లేదా రాస్. గుజరాత్‌లో "తల్వార్ రాస్" అని పిలుస్తారు. ఎందుకంటే ఈ నృత్యంలో ఉపయోగించే కర్రలు కత్తులను సూచిస్తాయి. ఇందులో పాల్గొనే ప్రతి యువతీ యువకుడు కూడా రెండు కర్రలను పట్టుకుని, తమ భాగస్వామితో లయబద్ధంగా కొడుతూ స్టెప్పులు వేస్తారు.
- గర్బాతో పోల్చుకుంటే ఇది కొంత వేగంగా సాగుతుంది. గర్బా తర్వాత విజయానికి చిహ్నంగా దాండియాను ప్రదర్శించడం ఆనవాయితీ.
తేడాలు ఇవీ..
- ఈ రెండు నృత్యాల మధ్య కొన్ని ప్రత్యేకమైన తేడాలు ఉన్నాయి. గర్బాకు ప్రాప్స్ అవసరం లేదు గానీ దాండియాకు రెండు కర్రలు అవసరం. గర్బా మధ్యస్థ లయలో సాగితే, దాండియా ఒకింత వేగంగా.. ఫుల్ ఎనర్జీగా ఉంటుంది.
- గర్బా భక్తికి ప్రతీకగా భావిస్తే- దాండియా దుర్గాదేవి, మహిషాసురుల మధ్య యుద్ధానికి సూచికగా భావిస్తారు. గర్బా సాధారణంగా అర్ధరాత్రి కావడానికి కొన్ని గంటల ముందు ప్రదర్శిస్తారు. దాండియా ఆ తర్వాత కూడా కొనసాగుతుంది.
వస్త్రధారణ..
- వస్త్రధారణ, సంగీతం విషయానికి వస్తే- గర్బాలో ఢోల్, ఢోలక్, హార్మోనియం వంటి సాంప్రదాయిక వాయిద్యాలతో భక్తి సంగీతం ఉంటుంది.
- దాండియాలో డ్రమ్స్, కీబోర్డులు వంటి ఆధునిక వాయిద్యాలు, వేగంగా సాగే బీట్స్ ఉంటాయి.
- రెండు నృత్యాలకూ మహిళలు చిన్నపాటి అద్దాలు కుట్టిన లెహంగాలను ధరిస్తారు. పురుషులు కుర్తా లేదా కేడియాలు, తలపాగాలతో కనిపిస్తారు. దాండియా దుస్తులు కలర్ ఫుల్ గా కనిపిస్తాయి.
నేడు- గర్బా, దాండియా గుజరాత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. దేశం అంతటా విస్తరించాయి. భారతీయులు పెద్ద సంఖ్యలో నివసించే విదేశాల్లోనూ వీటిని ప్రదర్శిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ తో పాటు న్యూజెర్సీ, లండన్ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications