దేశ రక్షణకు రూ.2.12 లక్షల కోట్ల మహా కవచం: కేంద్రం గ్రీన్ సిగ్నల్
దేశ త్రివిధ దళాల పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం భారీ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లకు అవసరమైన ఆయుధాలు, సైనిక రవాణా వాహనాలు, అధునాతన డ్రోన్ వ్యవస్థల కొనుగోలుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో నిర్వహించిన డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో అనుమతులు మంజూరు అయ్యాయి. మొత్తం రూ. 2.12 లక్షల కోట్ల అంచనా వ్యయంతో కూడిన వేర్వేరు రక్షణ ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం తెలిపింది.
ఇందులో దేశీయ పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది కేంద్రం. మొత్తం ఆమోదించిన ప్రతిపాదనలలో దాదాపు 82 శాతం కొనుగోళ్లను భారతీయ పరిశ్రమలు, తయారీదారుల నుంచే చేపడుతున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశీయ రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ ప్రతిపాదనలకు పరిపాలనాపరమైన యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ లభించడంతో టెండర్లు, ఒప్పందాల ప్రక్రియ వేగవంతం కానుంది.

ఆర్మీకి సంబంధించి క్లిష్టమైన సరిహద్దు ప్రాంతాలలో రాకపోకలు సాగించడానికి హై మొబిలిటీ వాహనాలు, ఆర్టిలరీ సామర్థ్యాన్ని పెంచే సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రాక్డ్ గన్ సిస్టమ్స్ సేకరణకు డీఏసీ అంగీకారం తెలిపింది. వీటితో పాటు శత్రువులు కాల్పులు జరిపిన వెంటనే వారు ఎక్కడ ఉన్నారనేది వంద శాతం ఖచ్చితత్వంతో పసిగట్టే గన్ షాట్ రెస్పాన్స్ సిస్టమ్స్‌ను కూడా కొనుగోలు చేయనుంది రక్షణ మంత్రిత్వ శాఖ. ఆధునిక యుద్ధరంగంలో కీలకపాత్ర పోషిస్తున్న డ్రోన్ ముప్పును ఎదుర్కొనడానికి వీలుగా స్పెషలైజ్డ్ కౌంటర్ డ్రోన్లను సమకూర్చుకోనుంది.
ఆర్మీ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను మరింత పటిష్టపర్చడానికి అవసరమైన అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, లాంగ్ రేంజ్ కామికేజ్ డ్రోన్ సిస్టమ్స్, ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ అండ్ స్ట్రైక్ సిస్టమ్‌లకు కూడా కౌన్సిల్ నుండి అనుమతి లభించింది. శత్రువుల వైమానిక దాడులను అడ్డుకునేందుకు వెరీ షార్ట్ రేంజ్ క్షిపణులను కేంద్రం కొనుగోలు చేయనుంది. ఆర్మీ, వైమానిక దళం రెండింటికీ ఉపయోగపడే లైట్ మల్టీ రోల్ హెలికాప్టర్లు సైతం రక్షణ శాఖలో చేరనున్నాయి. ఇంటెలిజెన్స్, ట్రాన్స్ పోర్ట్, డిజాస్టర్ వంటి సందర్భాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
నౌకాదళం కోసం స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే సరికొత్త యుద్ధనౌకలు, యాక్టివ్ ఆఫ్ బోర్డ్ డెకాయ్ సిస్టమ్స్ కొనుగోలుకు మార్గం సుగమమైంది. శత్రు దేశాలు ప్రయోగించే అత్యాధునిక యాంటీ షిప్ మిస్సైల్స్ నుండి యుద్ధనౌకలను సురక్షితంగా కాపాడటానికి ఈ డెకాయ్ వ్యవస్థలు ఉపయోగపడతాయి. సముద్ర తీర ప్రాంతాలు, అంతర్జాతీయ జలాల్లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి నౌకాదళానికి ఈ వనరులు కీలకంగా మారనున్నాయి.
వైమానిక దళ అవసరాల కోసం స్పెషల్ యుటిలిటీ హెలికాప్టర్లు, ఆయుధ వ్యవస్థలతో పాటు మొబైల్ ఎక్స్ బాండ్ డాప్లర్ వెదర్ రాడార్ సిస్టమ్స్ కొనుగోలుకు అనుమతి లభించింది. సరిహద్దుల్లో విభిన్న భూభాగాల్లో గగనతల రవాణా అవసరాలను తీర్చడంలో ఈ యుటిలిటీ హెలికాప్టర్లు సహాయపడతాయి. అలాగే ముందస్తు సమాచారాన్ని పసిగట్టడంలో వెదర్ రాడార్లు కీలకపాత్ర పోషిస్తాయి.













Click it and Unblock the Notifications
