ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: 15 మందితో కాంగ్రెస్ 3వ జాబితా విడుదల
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంలో పోటీపడుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. మొత్తం 15 మంది అభ్యర్థుల పేర్లతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం రాత్రి ప్రకటించారు.
మాజీ కేంద్రమంత్రి కృష్ణతీర్థ్.. పటేల్ నగర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కౌన్సిలర్ ఆరిబాఖాన్‌కు ఓఖ్లా అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం కల్పించారు. గోకల్‌పూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి తొలుత ప్రమోద్ కుమార్ జయత్ పేరును ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయన స్థానంలో ఈశ్వర్ బాగ్రీ పోటీ చేస్తారని తాజా జాబితాలో స్పష్టం చేసింది.

ఢిల్లీలోని మొత్తం 70 నియోజవర్గాలకు గాన ఇప్పటి వరకు 63 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. జనవరి నెల ప్రారంభంలో విడుదల చేసిన జాబితాలో కల్కాజీ నియోజకవర్గం నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా పోటీ చేస్తారని ప్రకటించింది.
కల్కాజీ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ పోటీ చేస్తున్నారు. న్యూఢిల్లీలో ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. ఆయనపై మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ పోటీలో నిలిపింది.
కాంగ్రెస్ నాయకుడు రాజేష్ గుప్తా కిరారీ నుంచి, కున్వర్ కరణ్ సింగ్ మోడల్ టౌన్ నుంచి, జగత్ సింగ్ షహదారా నుంచి, రాజీవ్ చౌదరి విశ్వాస్ నగర్ నుంచి, విశేష్ తోకాస్ ఆర్ కె పురం నుంచి పోటీలో ఉన్నారు.
హరి నగర్ నుంచి ప్రేమ్ శర్మ, పాలెం నుంచి మంగే రామ్, గాంధీ నగర్ నుంచి కమల్ అరోరా, జనక్‌పురి నుంచి హర్బానీ కౌర్, నజఫ్‌గఢ్ నుంచి సుష్మా యాదవ్ బరిలో ఉన్నారు.
Congress releases the third list of 16 candidates for #DelhiElections2025 pic.twitter.com/ya29BoeE5U
— ANI (@ANI) January 14, 2025
26 మంది పేర్లతో పార్టీ రెండో జాబితాను జనవరి 6న విడుదల చేశారు. జంగ్‌పురా స్థానం నుంచి ఆప్ నేత మనీష్ సిసోడియాపై ఫర్హాద్ సూరిని పార్టీ పోటీలో నిలిపింది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఆప్ మాజీ ఎమ్మెల్యేలకు కూడా టిక్కెట్లు ఇచ్చారు. అసిమ్ ఖాన్ మతియా మహల్ నుంచి, దేవేందర్ సెహ్రావత్ బిజ్వాసన్ నుంచి పోటీ చేయనున్నారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 5న జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.












Click it and Unblock the Notifications