వరుస అరెస్టుల దెబ్బ: ధ్యానంలో వెళ్లిన ముఖ్యమంత్రి- దేశం కోసం
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని స్థానిక రోజ్ అవెన్యూ పొడిగించింది. ఈ నెల 20వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు తెలిపింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.
మద్యం పాలసీని రూపొందించే విషయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో- సీబీఐ రంగంలోకి దిగింది. కిందటి నెల 29వ తేదీన మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఈ నెల 20వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది.

ఈ కేసులో ప్రధాన సాక్షులు ఎక్సైజ్ శాఖ మాజీ కమిషనర్ అర్వ గోపి కృష్ణ, మాజీ కార్యదర్శి సీ అరవింద్ సైతం విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు కూడా సీబీఐ అధికారులు నోటీసులను జారీ చేశారు. విచారణ కోసం ఢిల్లీకి రావాల్సిందిగా సూచించారు.
వరుసగా విచారణలు, అరెస్టులను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. హోలీ పండగను పురస్కరించుకుని ఆయన ఇవ్వాళ ధ్యాన దీక్షను చేపట్టారు. ఏడు గంటల పాటు మెడిటేషన్ లో ఉంటోన్నారు.
తెల్లటి వస్త్రాలను ధరించి మెడిటేషన్ లో కూర్చున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఈ ఉదయం 10 గంటలకు ధ్యాన దీక్షలో కూర్చున్నారాయన. సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగుతుంది. దేశం కోసం తప్పట్లేదని వ్యాఖ్యానించింది ఆమ్ ఆద్మీ పార్టీ. పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులకు ఆధునిక సౌకర్యాలను కల్పించిన వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జైలుకు పంపిస్తోన్నారని, దేశాన్ని దోచుకుంటోన్నా వారిని ఆయన అక్కున చేర్చుకుంటోన్నారని మండిపడింది. దేశ హితం కోరుతూ తమ ముఖ్యమంత్రి ఏడు గంటల పాటు ధ్యాన దీక్షను కొనసాగిస్తోన్నారని తెలిపింది.












Click it and Unblock the Notifications