సీబీఐ సమన్లపై అరవింద్ కేజ్రివాల్ రియాక్షన్..టార్చర్, బెదిరింపులతో వాంగ్మూలాలు ?
ఢిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వ పెద్దలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధుల్ని సీబీఐ ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాను కూడా అరెస్టు చేసి జైలుకు పంపింది. ఇప్పుడు తాజాగా సీఎం అరవింద్ కేజ్రివాల్ కు రేపు విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది. ఈ నేపథ్యంలో సీబీఐ సమన్లపై స్పందించేందుకు కేజ్రివాల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఆప్ నేత మనీష్ సిసోడియా 14 ఫోన్లు ధ్వంసం చేశారంటూ ఈడీ, సీబీఐ చేస్తున్న ఆరోపణలను సీఎం కేజ్రివాల్ తీవ్రంగా ఖండించారు. ఈ ఫోన్లలో చాలా మటుకు ప్రస్తుతం ఎవరెవరో వాడుతున్నారని, వాటి ఐఎంఏఈ నంబర్లను కూడా బయటపెట్టారు. ఇదంతా కేవలం సిసోడియాను ఇరికించేందుకు ఈడీ, సీబీఐ చెబుతున్న అబద్ధాలేనన్నారు.

సిసోడియాను అపరాధిగా నిరూపించేందుకు చందన్ రెడ్డి అనే వ్యక్తిని సీబీఐ కస్టడీలో తీవ్రంగా టార్చర్ చేశారని కేజ్రివాల్ ఆరోపించారు. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ వంటి వారిని కూడా టార్చర్ చేసి వాంగ్మూలాలు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

రూ.100 కోట్ల స్కాం చేశారని 400 సోదాలు చేసిన సీబీఐ, ఈడీ రూపాయి కూడా కనిపెట్టలేకపోయాయని కేజ్రివాల్ విమర్శించారు. గోవాలో తమ లిక్కర్ వెండార్లపైనా దాడులు చేసి హింసించారని, అక్కడా రూపాయి కూడా దొరకలేదన్నారు. మోడీకి సెప్టెంబర్ 17న వెయ్యి కోట్లు ఇచ్చానని ఆరోపిస్తానని, దీనిపై మోడీని కూడా అరెస్టు చేస్తారా అని సీబీఐని ప్రశ్నించారు. కేజ్రివాల్ అవినీతిపరుడైతే ఈ దేశంలో ఎవరూ నీతిపరులు కారన్నారు. నిండా అవినీతిలో మునిగిన ప్రధాని.. తమపై విమర్శలు చేస్తున్నారన్నారు.
దేశ చరిత్రలో ఆప్ ను టార్గెట్ చేసినంతగా ఏ పార్టీనీ టార్గెట్ చేయలేదన్నారు. తమ పార్టీలో నంబర్ టూను జైలుకు పంపారని, ఇప్పుడు తన దాకా వచ్చారన్నారు. సీబీఐ తనను రేపు విచారణకు పిలిచిందని, తాను కచ్చితంగా విచారణకు హాజరవుతానని కేజ్రివాల్ ప్రకటించారు. కేజ్రివాల్ ను సీబీఐ అరెస్టు చేయబోతోందంటూ బీజేపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి పదే పదే చెబుతున్నారని పేర్కొన్నారు. అయినా తాము వీటికి భయపడే సమస్యే లేదన్నారు. ఈ దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీజేపీయేనన్నారు.












Click it and Unblock the Notifications