ఈడీ కేసులో కోర్టు విచారణకు హాజరైన ముఖ్యమంత్రి
Arvind Kejriwal: దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం సంభవించింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానంలో వీడియో కాన్ఫరెన్స్ రూపంలో విచారణను ఎదుర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే అయిదుసార్లు అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. శనివారం విచారణకు హాజరు కావాలంటూ మరోసారి ఆదేశాలు ఇచ్చారు. విచారణలో భాగంగా ఉదయం తమ కార్యాలయానికి రావాల్సి ఉంటుందంటూ సూచించినప్పటికీ- ఆయన మాత్రం గైర్హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణకు హాజరయ్యేలా కేజ్రీవాల్‌కు ఆదేశాలను జారీ చేయాలంటూ పిటీషన్లను దాఖలు చేశారు. ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించింది ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు. కేజ్రీవాల్‌కు సమన్లను జారీ చేసింది.
ఈ నేపథ్యంలో- తప్పనిసరిగా విచారణకు హాజరయ్యారాయన. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో విచారణను ఎదుర్కొన్నారు. తాను స్వయంగా కోర్టుకు రాలేకపోతున్నానని వివరించారు. దీనికి గల కారణాలను వివరించారు. ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్నీ ప్రవేశపెట్టామని గుర్తు చేశారు.
ఈ విశ్వాస తీర్మానంపై సభలో ఓటింగ్ జరగాల్సి ఉన్నందున తాను వ్యక్తిగతంగా న్యాయస్థానానికి హాజరు కాలేకపోతున్నానని వివరణ ఇచ్చారు. గతంలో ఇదే ఈడీ అధికారులు.. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలనూ విచారించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఏడాది కాలంగా ఆయన జైలు జీవితాన్ని గడుపుతోన్నారు. బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటీషన్లన్నింటినీ కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.












Click it and Unblock the Notifications