ఢిల్లీలో తొలి 'క్లౌడ్-సీడింగ్' విమానం టేకాఫ్: కృత్రిమ వర్షంతో కాలుష్యానికి చెక్!
దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కృత్రిమ వర్షాన్ని కురిపించడం ద్వారా గాలిలో విషపూరిత స్థాయిలను తగ్గించే లక్ష్యంతో ఢిల్లీ తన మొట్టమొదటి క్లౌడ్-సీడింగ్ ట్రయల్‌ను ప్రారంభించింది. కాలుష్యం అధికంగా ఉండే చలికాలంలో గాలి నాణ్యత క్షీణించడాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విస్తృత వ్యూహంలో ఈ కృత్రిమ వర్షం ప్రయోగం ఓ భాగంగా నిలుస్తోంది.
కాన్పూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్న విమానం
ఢిల్లీలో తొలి క్లౌడ్-సీడింగ్ ప్రయోగం కోసం నియమించబడిన ఓ విమానం మంగళవారం కాన్పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ ఆపరేషన్ వాయవ్య ఢిల్లీలోని బురారి ప్రాంతంలో నిర్వహించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అధికారుల ప్రకారం.. తగినంత తేమ, అనుకూలమైన మేఘాల నిర్మాణం వంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయత్నం ముందుకు సాగుతుంది. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే విమానం నేరుగా మీరట్‌కు చేరుకుంటుంది. పరిస్థితులు మెరుగుపడే వరకు విమానం అక్కడే ఉంచబడుతుంది. ఈ తొలి ట్రయల్ పూర్తయిన తర్వాత కూడా తదుపరి ఆపరేషన్ల కోసం విమానాన్ని మీరట్ విమానాశ్రయంలోనే ఉంచుతారు.

క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటి?
క్లౌడ్ సీడింగ్ అనేది కృత్రిమ వర్షపాతాన్ని ప్రేరేపించే ఓ ప్రక్రియ. ఇందులో సిల్వర్ అయోడైడ్ లేదా ఇతర పదార్థాలను విమానం ద్వారా మేఘాల్లోకి విడుదల చేస్తారు. ఈ పదార్థాలు మేఘాల్లోని తేమతో కూడిన కణాలను ద్రవరూపంలోకి మార్చి చివరకు వర్షంగా కురవడానికి సహాయపడతాయి. ఢిల్లీలో ఈ వర్షం కురిస్తే గాలిలోని కాలుష్య కణాలు కిందకి కొట్టుకుపోయి వాయు నాణ్యత తాత్కాలికంగా మెరుగుపడుతుంది.
#WATCH | Aircraft for cloud seeding in Delhi has taken off from Kanpur, Uttar Pradesh.
— ANI (@ANI) October 28, 2025
(Video Source: IIT Kanpur media cell) pic.twitter.com/hxhMQLvMPk
క్లౌడ్ సీడింగ్ చేయాలంటే ముందు ఆకాశంలో మేఘాలు ఉండాలి. మజ్జిగ ఉంటేనే చిలకగలం.. అలాగే క్లౌడ్ సీడింగ్‌లోనూ అంతే. మేఘాలు ఉంటేనే వర్షం పడుతుంది. అయితే ఈ ప్రయోగం సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఇక కాలుష్యానికి తరచూ క్లౌడ్ సీడింగ్ ద్వారా పరిష్కారం రానుంది. తద్వారా కాలుష్యం పెరగకుండా చేయవచ్చు. ప్రతీ ఏడాది దీపావళి అనంతరం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకే క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వం, ఐఐటీ-కాన్పూర్ కలిసి అభివృద్ధి చేశాయి. ఇది తాత్కాలిక పరిష్కారంగానే భావించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఢిల్లీ సర్కారు ఈ ఏడాది మే నెలలో.. రూ.3.21 కోట్లు కేటాయించింది.
క్లౌడ్ సీడింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసా?
ఈ క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టులో భాగంగా ఆకాశంలో సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్‌ని మేఘాల మధ్య చల్లుకుంటూ వెళ్తారు. ఆ పదార్థాలు తేమను సృష్టిస్తాయి. తద్వారా మేఘాలను మరింత చల్లగా మార్చేస్తాయి. ఈ క్రమంలో ఆవిరి అణువులు దగ్గరకు చేరుకుంటాయి. అలా అవి బరువెక్కి భూమి ఆకర్షణ కారణంగా భూమిపై వర్షంలా పడతాయి.












Click it and Unblock the Notifications