ఆ సర్టిఫికేట్ లేకపోతే నో పెట్రోల్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
దేశ రాజధాని పరిధిలో పెరిగిపోతున్న వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ సర్కారు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. వాహన ఉద్గారాల కట్టడియే లక్ష్యంగా చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ పత్రం(PUC-Pollution Under Control Certificate) లేని ఏ వాహనానికైనా ఇంధన సరఫరాను పూర్తిగా నిలిపివేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం. సరైన పీయూసీ సర్టిఫికేట్ చూపించని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు సీఎన్‌జీ, ఎల్పీజీ వంటి ఎలాంటి ఫ్యూయల్‌ను విక్రయించడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశించింది.
అన్ని బంకులకు కఠిన ఆదేశాలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఈ నిబంధనను క్షేత్రస్థాయిలో ఎటువంటి లోపాలు లేకుండా అత్యంత కఠినంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. రాజధానిలోని ప్రతి పెట్రోల్ పంప్, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ యజమానులు ఈ ఉత్తర్వులను అక్షరాలా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. వాహనదారుల వద్ద పీయూసీ సర్టిఫికేట్‌ను నిశితంగా పరిశీలించిన తర్వాతే ఇంధనం పోయాలని సూచించింది. ఈ ప్రక్రియలో ఏమాత్రం అలసత్వం వహించినా లేదా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలినా సదరు పెట్రోల్ బంకులపై తీవ్ర చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

కాలుష్య రహిత ఢిల్లీయే మా లక్ష్యం: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. ఢిల్లీలో గాలి నాణ్యతను పెంచడం, పౌరులందరికీ ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రకటించారు. "ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే ఇలాంటి కఠినమైన, క్రియాశీలక నిర్ణయాలు తప్పనిసరి. వాహనాల నుంచి వెలువడే ప్రమాదకర పొగను అరికట్టేందుకు ఈ పీయూసీ నిబంధన ఓ కీలక ముందడుగుగా తోడ్పడుతుంది" అని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. భవిష్యత్తులోనూ వాయు నాణ్యత మెరుగుదల కోసం మరిన్ని సమగ్ర చర్యలు చేపడతామని సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
