Artificial Rain: ఢిల్లీలో కాలుష్యం కట్టడికి కృత్రిమ వర్షం ప్రతిపాదన.. అదెలా పనిచేస్తుందంటే..
Delhi air pollution: దేశ రాజధాని ఢిల్లీలో గతకొన్నేళ్లుగా గాలికాలుష్యం తారాస్థాయికి చేరింది. దీనిపై తీవ్ర ఆందోళన నెలకొంది. సదరు రాష్ట్ర ప్రభుత్వం దీనిని కట్టడి చేసేందుకు పలు చర్యలు తీసుకుంటూనే ఉన్నా, అవి అనుకున్న మేర సత్ఫలితాలు ఇస్తున్న దాఖలాలు లేవు. స్మాగ్ గన్స్, సరిబేసి విధానంలో వాహనాల ప్రయాణం వంటి ప్రత్యామ్నాయాలు పరీక్షించినా అంతగా ఉపయోగం లేకుండా పోతోంది. కాగా ఇప్పుడు 'ఆర్టిఫిషియల్ రైన్' పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (AQI) దాదాపు 500కి చేరుకుంది. దీంతో తీవ్ర స్థాయిలో పెరిగిపోయిన వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి కృత్రిమ వర్షాన్ని కురిపించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకుగాను క్లౌడ్ సీడింగ్‌ను అనుమతించాలని ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. తద్వారా వాతావరణం నుంచి కాలుష్య కారకాలను తొలగించడంతో పాటు గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

క్లౌడ్ సీడింగ్ అనేది వాతావరణాన్ని మార్చడానికి ఉపయోగించే సాంకేతికత. సహజసిద్ధంగా వర్షం కురవడానికి ప్రతిగా కృత్రిమ పద్ధతుల్లో మేఘాల నుంచి వర్షపాతాన్ని పెంచడం దీని లక్ష్యం. అయితే ఇదేమీ అనుకున్నంత తేలికైతే కాదు. ఈ ప్రక్రియలో మొదటగా అనువైన మేఘాలను గుర్తిస్తారు. అనంతరం వాటిపై సిల్వర్ అయోడైడ్, డ్రై ఐస్ లేదా పొటాషియం అయోడైడ్ వంటి కొన్ని ఆర్టిఫిషియల్ ఏజెంట్లతో సీడింగ్ చేస్తారు.
సీడింగ్ ఏజెంట్‌ను మేఘాలపై రిలీజ్ చేసేందుకు బర్నర్‌లతో కూడిన విమానాలను వినియోగిస్తారు. ఇవి మేఘాలపై ఎగురుతూ పని పూర్తిచేస్తాయి. సీడింగ్ ఏజెంట్ విడుదల కాగానే దాని చుట్టూ నీటి బిందువులను ఏర్పరుస్తుంది. ఎక్కువగా మంచు గడ్డకట్టినప్పుడు లేదా పెద్ద నీటి బిందువులు ఏర్పడినప్పుడు, అవి మేఘాల్లోని ఇతర బిందువులతో ఢీకొంటాయి. అవి తగినంత బరువుగా మారినప్పుడు మేఘాల నుంచి వర్షం లేదా మంచులా వస్తాయి.
అయితే పూర్తిగా కాలుష్యంతో నిండిపోయిన ఢిల్లీలో గాలి నాణ్యతను మెరుగుపరచేందుకు కృత్రిమ వర్షం సబబేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పొల్యూషన్ తీవ్ర స్థాయిలో ఉన్నవేళ ఆర్టిఫిషియల్ రైన్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం వర్షంతో కాలుష్యాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ఇది పనిచేసే సంభావ్యత చాలా తక్కువేనంటూ పెదవి విరుస్తున్నారు.












Click it and Unblock the Notifications