డిప్యూటీ సీఎంకు మరో షాక్-
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని స్థానిక రోజ్ అవెన్యూ పొడిగించింది. ఈ నెల 20వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు తెలిపింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేసిన వ్యవహారంపై చెలరేగిన దుమారం తగ్గట్లేదు. మద్యం పాలసీని రూపొందించే విషయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో- సీబీఐ రంగంలోకి దిగింది.
ఇవ్వాళ సీబీఐ అధికారులు మనీష్ సిసోడియాను మరోసారి ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. స్పెషల్ జడ్జి ఎం కే నాగ్ పాల్ ఈ పిటీషన్ పై విచారణ జరిపారు. ఇదివరకు ఇదే న్యాయమూర్తి- మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్ ను ఈ నెల 10వ తేదీకి లిస్టింగ్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా- మనీష్ సిసోడియా కస్టడీని మరో 15 రోజులపాటు పొడిగించాలంటూ సీబీఐ అధికారులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ప్రధాన సాక్షులు ఎక్సైజ్ శాఖ మాజీ కమిషనర్ అర్వ గోపి కృష్ణ, మాజీ కార్యదర్శి సీ అరవింద్ పాత్ర ఉన్నట్లు చెప్పారు. వారి వాంగ్మూలాలను మరిన్ని నమోదు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరిన్ని కీలక విషయాలను వెలికి తీయాల్సి ఉందని పేర్కొన్నారు.
ఈ స్కామ్ లో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న మనీష్ సిసోడియా కస్టడీని పొడిగించాలంటూ సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పలుకుబడి కలిగిన నాయకుడు కావడం వల్ల- బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేయగలిగే అవకాశాలు కూడా లేకపోలేదని వాదించారు. అక్రమంగా కోట్లాది రూపాయల మేర ముడుపులు చేతులు మారినట్లు ఫిర్యాదులు ఉన్నాయని, వాటిపై సమగ్రంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మనీష్ సిసోడియా తరఫున సీనియర్ అడ్వొకేట్ దయాన్ కృష్ణన్- తన వాదనలను వినిపించారు. సీబీఐ తరఫు న్యాయవాది దాఖలు చేసిన రిమాండ్ పిటీషన్ ను తప్పుపట్టారు. వాదోపవాదాలను ఆలకించిన తరువాత ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం- మనీష్ సిసోడియా కస్టడీని పొడిగించింది. ఈ నెల 20వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.












Click it and Unblock the Notifications