పంతం నెగ్గించుకున్న సీబీఐ..!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఇవ్వాళ సీబీఐ అధికారులు ఆయనను ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరిచారు. అయిదు రోజుల కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో సీబీఐ అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన వ్యవహారం- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. మద్యం పాలసీని రూపొందించే విషయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో- సీబీఐ రంగంలోకి దిగింది.
సీబీఐ విచారణ..
ఈ కేసులో ఆదివారం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారణకు పిలిపించారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకు విచారించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తోన్నట్లు ప్రకటించారు. మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు సీబీఐ అధికారులు ముందు నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు. ఇదివరకే ఆయనను విచారించారు కూడా. మరోసారి మనీష్ సిసోడియాను విచారణకు పిలిపించారు సీబీఐ అధికారులు. అనంతరం అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

న్యాయస్థానం సమక్షానికి..
ఈ మధ్యాహ్నం సీబీఐ అధికారులు మనీష్ సిసోడియాను ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక విషయాలను వెలికి తీయాల్సి ఉందని, ఈ స్కామ్ లో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న మనీష్ సిసోడియాను విచారించాల్సి ఉందని, ఆయనను తమ కస్టడీకి అప్పగించాలంటూ న్యాయస్థానానికి సీబీఐ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.

కస్టడీకి కోరుతూ..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వ్యక్తి పలుకుబడి కలిగిన నాయకుడు కావడం వల్ల సాక్ష్యాధారాలను తారుమారు చేయగలిగే అవకాశాలు కూడా లేకపోలేదని సీబీఐ అధికారులు వాదించారు. అక్రమంగా కోట్లాది రూపాయల మేర ముడుపులు చేతులు మారినట్లు ఫిర్యాదులు ఉన్నాయని, వాటిపై సమగ్రంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రిమాండ్ పిటీషన్ పై..
మనీష్ సిసోడియా తరఫున సీనియర్ అడ్వొకేట్ దయాన్ కృష్ణన్- తన వాదనలను వినిపించారు. సీబీఐ తరఫు న్యాయవాది దాఖలు చేసిన రిమాండ్ పిటీషన్ ను తప్పుపట్టారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని కేసుల్లో- సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సంతృప్తికర సమాధానం ఇవ్వలేనంత మాత్రాన అరెస్ట్ చేయడం, కస్టడీకి కోరడం సరికాదని అన్నారు. గతంలోనూ మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారని గుర్తు చేశారు.

మార్చి 4 వరకు..
వాదోపవాదాలను ఆలకించిన తరువాత ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం- మనీష్ సిసోడియాను సీబీఐ అధికారుల కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అడ్వొకేట్ దయాన్ కృష్ణన్ చేసిన వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. అయిదు రోజుల పాటు అంటే మార్చి 4వ తేదీ వరకు మనీష్ సిసోడియాను సీబీఐ రిమాండ్ కు తరలించింది.












Click it and Unblock the Notifications