అభిజిత్ దిప్కే కుటుంబంలో తీవ్ర విషాదం- ఇంటికి పంపిస్తామన్న పోలీసులు
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన నాయనమ్మ ఈ మధ్యాహ్నం మహారాష్ట్రలోని హింగోలీలో కన్నుమూశారు. స్వగ్రామంలో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోగా, మరోవైపు దిప్కే.. ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉండటం మరింత విషాదాన్ని కలిగించిందా కుటుంబానికి. దేశ రాజధానిలో నిరసన కార్యక్రమానికి వచ్చిన దిప్కేను ఈ ఉదయం విమానంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
హింగోలీ జిల్లా సంతూక్ పింప్రిలో అభిజీత్ దిప్కే నాయనమ్మ నివసిస్తోన్నారు. కొన్ని రోజులుగా ఆమె వయోధిక సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మధ్యాహ్నం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అభిజీత్ తండ్రి భగవాన్ దిప్కే తల్లి. మరణవార్త తెలిసిన వెంటనే ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న అభిజీత్ తల్లిదండ్రులు అనితా దిప్కే, భగవాన్ దిప్కే దిగ్భ్రాంతికి గురయ్యారు. కడసారి చూపు చూడటానికి వారు వెంటనే సంతూక్ పింప్రికి బయలుదేరి వెళ్లారు.

కుటుంబంలో పెద్ద దిక్కు మరణించిన విషయాన్ని తెలుసుకున్న బంధువులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. నాయనమ్మ మరణించిన విషయాన్ని ఢిల్లీ పోలీసులు అభిజిత్ దిప్కేకు తెలియజేశారు. ఇటువంటి అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉండటానికి, అంత్యక్రియలలో పాల్గొనడానికి ఆయనను మహారాష్ట్రకు వెళ్లడానికి ఢిల్లీ పోలీసులు అంగీకరించారు. మహారాష్టకు వెళ్లడానికి ఎటువంటి ముందస్తు అనుమతులు అవసరం లేదని, ఆయన ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చని, ఇందులో అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు.
నాయనమ్మ అంతిమ సంస్కారాల్లో పాల్గొనడానికి దిప్కే వెళ్లాలనుకుంటే వెంటనే విడుదల చేస్తామని, ధర్నా కొనసాగించాలనుకుంటే తమ అదుపులోనే ఉండాలని స్పష్టం చేశారు. ఇది ఆయన తీసుకునే తుదినిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఢిల్లీ పోలీసులు వివరించారు. నిరసన తెలియజేయడానికి ఢిల్లీకి వచ్చి విమానంలోనే దిప్కే పోలీసుల అదుపులోకి వెళ్లడం, సరిగ్గా అదే సమయంలో స్వగ్రామంలో నానమ్మ కన్నుమూయడం అభిజీత్ మద్దతుదారులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.












Click it and Unblock the Notifications
