రెండో రోజూ స్కూల్స్ బంద్..!!
న్యూఢిల్లీ: భారీ వర్షాలు.. ఉత్తరాది రాష్ట్రాలను వదలట్లేదు. అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు నదులు పోటెత్తుతున్నాయి.. ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్.. ఇలా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమౌతోన్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం ఆయా రాష్ట్రాల్లో నమోదవుతోంది.
హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ.. భారీ వర్షాలకు చివురుటాకులా వణికిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్, రావి, సట్లేజ్.. నదులు మహోగ్రరూపాన్ని దాల్చాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్నాయి. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యమునా నది ఉప్పొంగింది. గతంలో ఎప్పుడూ లేనంత ఉగ్రరూపాన్ని ధరించింది యమునమ్మ.

యమునా నది గరిష్ఠస్థాయి నీటిమట్టం 205.33 మీటర్లు. కాగా భారీ వర్షాల ధాటికి దీన్ని అధిగమించింది. లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. మయూర్ విహార్ ఫేస్ 3, లజ్‌పత్ నగర్- 1, నజఫ్‌గఢ్, ఓఖ్లా మార్గ్, మోడల్ టౌన్, సోమ్ బజార్, నరేలా, రోహిణి, సిరాస్‌పూర్, లోక్‌నాయక్ పురం, ద్వారకా, జంగ్‌పురా, జసోలా.. వంటి ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతం నమోదైంది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవును ప్రకటించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సెలవును ఇచ్చింది. వర్షాల తీవ్రత ఇంకా తగ్గకపోవడం, అనేక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తోండటం, పలు చోట్ల వరదనీరు పోటెత్తడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం ఈ సెలవులను పొడిగించింది. మంగళవారం కూడా సెలవు ఉంటుందని తెలిపింది.
అటు హిమాచల్ ప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అన్ని రిజర్వాయర్‌లో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. వాటి గేట్లన్నింటినీ ఎత్తివేశారు అధికారులు. దీని ప్రభావం తీర ప్రాంతాలపై పడింది. బియాస్, రావి, సట్లేజ్ నదుల తీరప్రాంతాలన్నీ మునిగిపోయాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.
బిలాస్‌పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, ఉనా, హమీర్‌పూర్, మండి, కుల్లు-మనాలి, కిన్నౌర్, చంబా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాల్లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వచ్చే మూడు రోజుల పాటు మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరించింది. ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.












Click it and Unblock the Notifications