అన్నింటికీ తయ్యార్: సెక్షన్ 163 విధింపు: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత
దేశ రాజధానిలో నేడు కాక్రోచ్ జనత పార్టీ భారీ ధర్నాను నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద భద్రతను ఢిల్లీ పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. న్యూఢిల్లీ జిల్లా పరిధిలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీతో పాటు ఇతర సంఘాలు ఈ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులను సైతం ప్రకటించారు.
ఈ నిషేధాజ్ఞల ప్రకారం ముందస్తుగా రాతపూర్వక అనుమతి లేకుండా అయిదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకచోట చేరడం, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించడం పూర్తిగా నిషిద్ధం. పోలీసుల అనుమతి లేనిదే.. ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించడం గానీ, నినాదాలు చేయడం, మైకులలో ప్రసంగాలు చేయడం చట్ట వ్యతిరేకం. ప్రదర్శనల్లో ఎలాంటి ఆయుధాలు, కర్రలు, బ్యానర్లు, ప్లకార్డులు వెంట తీసుకురావడాన్ని నిషేధించారు.

చట్టాన్ని ఉల్లంఘించే వారిపై బీఎన్ఎస్ లోని సెక్షన్ 223 కింద కఠినమైన కేసులు నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిరసన నేపథ్యంలో న్యూఢిల్లీలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ విభాగం వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది. కన్నాట్ ప్లేస్, పటేల్ చౌక్, జీపీఓ, టాల్‌స్టాయ్ మార్గ్, జంతర్ మంతర్ రోడ్, పార్లమెంట్ స్ట్రీట్ తదితర వీఐపీ రహదారుల గుండా ప్రయాణించే వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
కన్నాట్ ప్లేస్ నుండి పటేల్ చౌక్ వైపు వెళ్లే వాహనాలను ట్రాఫిక్ సిబ్బంది ఇతర మార్గాల ద్వారా మళ్లించారు. టాల్‌స్టాయ్ మార్గ్, జంతర్ మంతర్ రోడ్డు వంటి బిజీగా ఉండే రహదారుల వైపు ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయ దారులను ఉపయోగించుకోవడం మంచిదని సూచించారు.
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా వందలాది మంది అదనపు పోలీసు బలగాలతో పాటు ప్రత్యేక రక్షణ దళాలను కూడా మోహరించారు. జంతర్ మంతర్ పరిసరాల్లో బారికేడ్లు అమర్చారు టియర్ గ్యాస్ వాహనాలను సిద్ధం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి ఢిల్లీ పోలీసులు సిద్ధమైనట్టే కనిపిస్తోందక్కడి వాతావరణాన్ని బట్టి చూస్తోంటే.
మరోవంక.. పలు మెట్రో స్టేషన్లు కూడా మూతపడ్డాయి. జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, సేవా తీర్థ, మండి హౌస్, లోక్ కళ్యాణ్ మార్గ్, ఐఎన్ఏ, ఛావ్రి బజార్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, న్యూఢిల్లీ స్టేషన్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. రాజీవ్ చౌక్, మండి హౌస్, న్యూఢిల్లీ, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్‌ఛేంజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించింది.













Click it and Unblock the Notifications
