లోక్ సభలో ఢిల్లీ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం-రాజ్యాంగ వ్యతిరేకమన్న విపక్షాలు..
ఢిల్లీలో అధికారులు, సేవలపై ఎవరి పెత్తనం ఉండాలనే దానిపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనబెట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో ఢిల్లీ సేవల బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతంగా పేర్కొంటూ దీనిపై కేంద్రానికే పెత్తనం ఉండేలా బిల్లులో పలు అంశాల్ని ఉంచారు. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. కేంద్రం తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఢిల్లీలోని బ్యూరోక్రాట్‌లపై తన నియంత్రణను సుస్థిరం చేసుకునేందుకు ఉద్దేశించిన వివాదాస్పద బిల్లును కేంద్రం ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023గా దీన్ని పేర్కొంది. దేశ రాజధానిలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను చట్టబద్ధం చేసేందుకు వీలుగా ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఢిల్లీ అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలపై నిబంధనలను రూపొందించడానికి కేంద్రానికి అధికారం ఇస్తుంది. దేశ రాజధాని అధికారుల సస్పెన్షన్‌లు, విచారణలు వంటి చర్యలు కూడా కేంద్రం నియంత్రణలో ఉంటాయి. ఫలితంగా ఈ బిల్లు ఢిల్లీ బ్యూరోక్రాట్లపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం, కేంద్ర నియామకం, నియంత్రణకు పనికొస్తుంది. ఈ బిల్లుపై ఆప్ మండిపడింది. ఈ బిల్లు దేశ రాజధానిలో ప్రజాస్వామ్యాన్ని బాబూక్రసీతో భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది.
కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, డీఎంకే సహా ఇండియా కూటమిలోని ఇతర విపక్ష పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యాంగ విరుద్ధంగా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని విమర్శించాయి. సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసేలా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పలువురు విపక్ష ఎంపీలు ప్రకటించారు. అలాగే అవిశ్వాసం పెండింగ్ లో ఉండగా ఇతర అంశాలపై చర్చలు చేపట్టకూడదన్న సంప్రదాయాన్ని కూడా కేంద్రం ఉల్లంఘించిందని విమర్శించారు.కేంద్రం మాత్రం రాజధానిలో పాలన సాఫీగా సాగేలా ఈ బిల్లు తెస్తున్నట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications