నోట్ల రద్దుతో తగ్గిన ఆదాయం: వ్యాపారస్తుల టర్నోవర్‌పై తెలంగాణ ప్రభుత్వం కన్ను
హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం నాడు అన్నారు. ఆయన ఈ రోజు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
శాఖలో బకాయి ఉన్న రూ.1,490 కోట్ల వసూలుకై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మూసివేసిన సంస్థలు, వ్యాపారస్థుల రూ.838 కోట్ల బకాయిల వసూలుకు ఆస్తుల స్వాధీన ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నారు.
నోట్ల రద్దుతో వాణిజ్య పన్నుల శాఖపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలన్నారు. వ్యాపారస్థుల టర్నోవర్ పైన దృష్టి సారించాలని సూచించారు. వాణిజ్య శాఖలో నోట్ల రద్దు ప్రకటన అనంతరం.. నవంబర్ 9 నుంచి 16 వరకు రూ.182కోట్లు వసూలైనట్లు చెప్పారు. బకాయిల వసూలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 24వ తేదీ వరకు బకాయిలు చెల్లించవచ్చన్నారు.

రూ.500 నోట్లు ఏవి?
కొత్తగా ముద్రించిన రూ.500 నోట్లను ఆర్బీఐ విడుదల చేసినా అవి ఇంకా రాష్ట్రానికి రాలేదని రాజీవ్ శర్మ చెప్పారు. రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నా లేనట్లేనని, చిన్న నోట్లు లేకుండా పెద్ద నోట్లతో ప్రయోజనం లేదన్నారు. కరెన్సీ రద్దు పరిణామాలపై రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోవడానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి సిన్హా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కరెన్సీ రద్దు నిర్ణయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని రాజీవ్ శర్మ వివరించారు. మరిన్ని చిన్న నోట్లను బ్యాంకులకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా కుదింపు నిర్ణయాన్ని పునః సమీక్షించాలన్నారు.












Click it and Unblock the Notifications