మోదీ బొమ్మ ఉంటే చాలు..: గంపగుత్తగా ఓట్లు
Devendra Fadnavis: మరాఠా గడ్డపై మరోసారి భారతీయ జనతా పార్టీ పాగా వేసినట్టే. శివసేన (ఏక్‌నాథ్ షిండే)- బీజేపీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) సారథ్యంలోని మహాయుటికే మరోసారి ఓటర్లు జైకొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఇక్కడ ఫలితాలు వెలువడుతున్నాయి.
మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని అందుకుంది మహాయుటి. 222 స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. ఎన్నో అంచనాలు ఉన్న మహా వికాస్ అఘాడీ పూర్తిగా నిరాశపరిచింది. ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. వంద సీట్లు కూడా ఆ పార్టీకి దక్కేలా కనిపించట్లేదు.

దాదాపుగా ఏకపక్షంగా వెలువడుతున్నాయి ఇక్కడి ఫలితాలు. ఓట్ల లెక్కింపు ఆరంభమైనప్పటి నుంచీ మహాయుటి దూకుడు కొనసాగింది. కొప్రి- పఛ్‌పకడీలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, నాగ్‌పూర్ సౌత్ వెస్ట్, బారామతిల్లో ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
శరద్ పవార్ వంటి సీనియర్ నాయకుడు సారథ్యాన్ని వహిస్తోన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు చెందిన చీలిక వర్గ ఎన్సీపీకే ఓటర్లు పట్టం కడుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థులనే మెజారిటీ స్థానాల్లో గెలిపిస్తోన్నారు.

ఫలితాలు వెలువడుతున్న కొద్దీ ముంబై, థానె, పుణే, నాసిక్, రత్నగిరి, షోలాపూర్, నాందెడ్ సహా పలు నగరాలు, జిల్లా కేంద్రాల్లో గల బీజేపీ, శివసేన (షిండే వర్గం), అజిత్ వర్గ ఎన్సీపీ కార్యాలయాల వద్ద ఉత్సవాలు జోరందుకున్నాయి. సంబరాలు మిన్నంటున్నాయి. ఆయా పార్టీల అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటోన్నారు. బాణాసంచా కాల్చుతున్నారు. స్వీట్లను పంచిపెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు స్వాగతిస్తోన్నారంటూ నినాదాలు చేస్తోన్నారు.
ఈ ఫలితాలపై బీజేపీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఏక్ హై తొ సేఫ్ హై, మోదీ హై తొ ముమ్కిన్ హై అంటూ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ పోస్ట్ పెట్టారు. ఈ ఘనత మొత్తం ఆయనకే దక్కుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications