Maha kumbhmela 2025: మనం ఎన్నడూ చూడని బాబాలు వీళ్లు..!
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా క్రతువు కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్య స్నాణాలు ఆచరిస్తున్నారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్ రాజ్ లో ఎక్కడ చూసినా జనసందోహంతో కిటకిటలాడుతోంది. అయితే కుంభమేళా మహా క్రతువులో భాగంగా మనం ఎన్నడూ చూడని బాబాలు ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నారు. బాబాలు అంటే చిక్కిపోయిన శరీరంతో ధ్యానం చేసుకుంటూ ఉంటారేమోనని పొరపాటు పడితే మీరు పప్పులో కాలేసినట్లే.. కండలు తిరిగిన దేహంతో బాహుబలి మాదిరి ఉన్నారు. వీరిలో మొదటగా మాట్లాడుకోవాల్సింది పెహల్వాన్ బాబా గురించి..
పెహల్వాన్ బాబా
పెహల్వాన్ బాబా అసలు పేరు రాజ్ పాల్ సింగ్. ఆయన లక్ష్యం యువతలో స్ఫూర్తిని నింపడమే. యువతలో ఆరోగ్యకరమైన జీవనవిధానంతోపాటు ఆధ్యాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా మహాకుంభమేళాలో ప్రత్యక్షమయ్యారు. 50 ఏళ్ల వయసులో 10వేల పుషప్స్ చేస్తూ భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అది కూడా ఒంటి చేత్తో పుషప్స్ చేస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. రాజ్ పాల్ సింగ్ ను మీడియా పలకరించగా.. " నా ఉద్దేశం యువతను మేల్కొల్పడమే.. యువత డ్రగ్స్ లాంటి వ్యసనాలను వదిలి ఆరోగ్యంగా జీవించాలి. భారత్ ను విశ్వగురు చేయాలి. నాకు 50ఏళ్లు. నేను ఒంటి చేత్తో 10వేల పుషప్స్ చేస్తాను. నేను ఈ వయసులో ఇంత చేశానంటే యువత.. దానికి నాలుగింతలు చేస్తారు" అని రాజ్ పాల్ సింగ్ తెలిపారు. యువకులు తమ తల్లిదండ్రులను, గురువులను,సాధువులను గౌరవించాలని కోరారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం ఇంటి ఫుడ్ ను మాత్రమే తీసుకోవాలన్నారు. వెరైటీ స్టంట్స్ చేస్తూ.. శరీర దారుఢ్యాన్ని ప్రదర్శిస్తూ యువతలో స్ఫూర్తిని నింపుతున్నానని అన్నారు.

ట్రీట్ మెంట్ బాబా..
ఒడిషా భువనేశ్వర్ కు చెందిన బాబా ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళాలో సందడి చేస్తున్నారు. ఆర్తాత్రన గా పేరొందిన ఈ బాబా దేవుని ఆశిస్సులతో ఎన్నోరకాల నయంకాని రోగాలకు ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు భక్తులు తెలిపారు. వెన్ను నొప్పి, భుజం నొప్పితో పాటు చికిత్స లేని అనేక రోగాలకు ట్రీట్ మెంట్ బాబా చికిత్స అందిస్తున్నట్లు ఆయన దగ్గర చికిత్స పొందిన తర్వాత భక్తులు చెబుతున్నారు.
ఈ బాబా గురించి ప్రయాగ్ రాజ్ మొత్తం తెలిసిపోవడంతో ఆయన టెంట్ వద్దకు రోగులు బారులు తీస్తున్నారు. సాధారణ ప్రజలతోపాటు సాధువులు కూడా ఆయన వద్ద చికిత్స తీసుకుంటున్నారు. దేవుడి ఆశీర్వాదం తోనే తాను రోగాలను నయం చేస్తున్నట్లు మీడియాతో ట్రీట్ మెంట్ బాబ తెలిపారు. డివైన్ హీలింగ్ పేరుతో 2011 నుంచి తాను ఇలా చాలా మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
వీరితోపాటు రష్యా నుంచి వచ్చిన బాహుబలి బాబాను ఇప్పటికే చూసుంటారు. ఏడడుగులకు పైగా ఎత్తు, కండలుతిరిగిన దేహంతో అలరిస్తున్నాడు ఈ బాహుబలి బాబా. ఈ బాబా అసలు పేరు ఆత్మ ప్రేమ్ గిరి మహరాజ్.












Click it and Unblock the Notifications