దేవయాని ఇష్యూ: సారీతప్ప, పరిస్థితి మారిందని కమల్
న్యూఢిల్లీ: భారత దౌత్యాధికారిణి దేవయాని విషయంలో అమెరికా క్షమాపణలు చెప్పాల్సిందేనని, వారి చర్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్రమంత్రి కమల్ నాథ్ శుక్రవారం మరోసారి స్పష్టం చేశారు. తాను క్షమాపణలు తప్ప మరో దానిని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
అలాగే దేవయాని పైన అమెరికా పెట్టిన కేసులను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు మారిపోయాయని, భారత్ కూడా మారిపోయిందన్నారు. తాము క్షమాపణలు చెప్పేది లేదని, ఆమె పైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, ఆమెపై వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంటామని అమెరికా గురువారం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో కమల్ నాథ్ మరోసారి పైవిధంగా స్పందించారు.

కాగా, దేవయాని పట్ల అమెరికా వైఖరిని నిరసిస్తూ భారత్ విమానాశ్రయాలలో అమెరికా డిప్లమేట్స్‌కు ప్రత్యేక సౌకర్యాల తొలగింపు కొనసాగుతోంది. అమెరికా డిప్లమేట్స్ తమ విమాన పాసులను సరెండర్ చేయాలని ప్రభుత్వం గురువారం రాత్రి మరోసారి ఆదేశించింది.
అంతేకాకుండా అమెరికా ఎంబసీలలో పని చేస్తున్న భారత జాతీయుల వివరాలను డిసెంబర్ 23వ తేదీలోగా ఇవ్వాలని ఆదేశించింది. వారి బ్యాంకు అకౌంట్స్, జీతాలు, పాన్ కార్డు నంబర్లు ఇవ్వాలంది.
మరోవైపు, అమెరికాలో భారత దౌత్యాధికారిణి దేవయాని పట్ల అమెరికా తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శుక్రవారం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని టిడిపి కార్యకర్తలను ముట్టడించారు. లోనికి చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేశారు.
పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దేవయాని వైఖరి పట్ల అమెరికా తక్షణమే భారత్‌కు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. దేవయానికి న్యాయం చేయాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరారు. దేవయాని ఇష్యూపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications