Dharmasthala case: శవాల గుట్టగా ధర్మస్థల.. అడుగడుగున అస్థిపంజరాలే!
Dharmasthala case: ఇది ఒళ్లు గొగుర్పొడిచే ఘటన. దాదాపు దశాబ్దకాలం కిందట జరిగిన ఘోరమైన ఘటన. ఇప్పుడు పశ్చాత్తాపంతో బయట పెట్టిన ఘటన. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ రాష్ట్రం ఉలిక్కి పడింది. ఇంతకీ ఆ ఘటనేంటి.. ఎక్కడ జరిగింది.. దశాబ్దాల తర్వాత ఎందుకు బయటపడింది.
అది కర్ణాటక రాష్ట్రం ధర్మస్థల.. ధర్మస్థల అంటే గుర్తుకొచ్చేది ఆధ్యాత్మిక ప్రాంతం. ఇక్కడ మంజునాథుడు కొలువై ఉంటారు. ఇది దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రాంతంలో ఒక ఘోరం వెలుగు చూసింది. అది కూడా దశాబ్ద కాలం తర్వాత. ఆ నేరంలో భాగం పంచుకున్న ఓ వ్యక్తి బయటపెట్టిన వివరాలు తెలిస్తే షాక్‌కు గురవుతారు. శవాలను పాతిపెట్టిన వ్యక్తే ఇప్పుడు పశ్చాత్తాపంతో అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. భయపడి ధర్మస్థలను వీడి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయిన ఆ వ్యక్తి మళ్లీ వచ్చి శవాలను పాతిపెట్టిన 13 ప్రాంతాలను చూపించడంతో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఈ తవ్వకాల్లో కీలక సాక్ష్యాలు అస్థిపంజరాల రూపంలో బయటపడుతున్నాయి.

ఈ క్రమంలో ధర్మస్థల ఆలయ పట్టణంలో సామూహిక ఖననాలపై జరుగుతున్న దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఆరో ప్రాంతంలో మానవ అస్థిపంజర అవశేషాలను కనుగొంది. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన సంచలన ఆరోపణలను ధ్రువీకరించే ప్రయత్నించే భాగంగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు ఏ స్థలంలోనూ సాక్ష్యాలు లభించకపోగా.. అతడు చూపించిన ఆరో ప్రాంతంలో సాక్ష్యం లభించింది. ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం.
పోలీసుల ప్రకారం.. లభ్యమైన ఈ అస్థిపంజర అవశేషాలు ఒక పురుషుడివి అయ్యే అవకాశం ఉంది. 1998 నుంచి 2014 మధ్యకాలం ధర్మస్థలలో మహిళలు, మైనర్ల మృతదేహాలను బలవంతంగా పూడ్చి పెట్టాలని లేదా దహనం చేయాలని తనను బలవంతం చేశారని.. వాటిలో చాలా వరకు లైంగిక వేధింపుల ఆనవాళ్లు ఉన్నాయని సదరు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించాడు. ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలోనే సిట్ దర్యాప్తు ప్రారంభమైంది.
విచారణలో కీలక మలుపు
ఘటనాస్థలిలో ఉన్న ఫోరెన్సిక్ బృందం లభ్యమైన అస్థిపంజర అవశేషాలను తదుపరి సమగ్ర దర్యాప్తు కోసం భద్రపరిచింది. మరిన్ని ఆధారాలను గుర్తించడంతో సహాయపడేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌ను కూడా ఆ ప్రాంతానికి తీసుకువచ్చారు. చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలు కావడంతో.. కాలం, పర్యావరణ పరిస్థితుల కారణంగా ఎముకలు చెల్లాచెదురుగా ఉండవచ్చని భావించి, తవ్వకాలు మరింత విస్తృతం చేశారు. సమాచారం అందించిన వ్యక్తి ఈ ఆరో ప్రాంతంలో రెండు మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులు ప్రస్తుతం ఈ అంచనాతోనే తమ విచారణను కొనసాగిస్తున్నారు. పోలీసు వర్గాల ప్రకారం.. లభ్యమైన అస్థిపంజర అవశేషాలు తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. వీటితో పాటు సాక్ష్యాలను మరింత పటిష్టం చేసే ప్రయత్నాల్లో భాగంగా తాడు, బట్టలు, ఒక ప్రింటర్, ఒక ల్యాపటాప్ వంటి అదనపు వస్తువులను కూడా ఈ ప్రదేశం నుంచి సేకరించారు. ఇవన్నీ దర్యాప్తులో కీలక పాత్ర పోషించనున్నాయి.
మునుపటి తవ్వకాలు ఇలా..
బుధవారం నాటికి ఈ కేసులో గుర్తించిన మొదటి 5 ప్రదేశాలలో మానవ అవశేషాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ప్రాంతాల్లో మొదటిది నేత్రావతి నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతాన్ని సమాచారం అందించిన వ్యక్తి సమక్షంలోనే తవ్వారు. అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, రెవెన్యూ శాఖ సిబ్బంది జేసీబీతో లోతుగా తవ్వకాలు జరిపినప్పటికీ ఆ స్థలం నీళ్లు వచ్చాయి తప్ప.. అక్కడ ఎటువంటి మానవ అవశేషాలు లభించలేదు. ఆరో ప్రాంతంలో లభ్యమైన ఈ మానవ అస్థిపంజర అవశేషాలు, సమాచారం ఇచ్చిన వ్యక్తి చేసిన వాదనలను ధ్రువీకరించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ ఆధారాలు ధర్మస్థల సామూహిక ఖననాల కేసు దర్యాప్తుకు కొత్త దిశానిర్దేశం చేయనున్నాయి.












Click it and Unblock the Notifications