కాంగ్రెస్ కు సర్జరీ చేయాల్సిన టైమ్ : దిగ్విజయ్, ప్రియాంకాస్త్రం సంధిస్తారా..!
న్యూఢిల్లీ : కొత్తగా ఎన్నికలు జరుగుతున్నా కొద్దీ.. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతోంది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క పుదుచ్చేరి మినహా మిగతా రాష్ట్రాల్లో ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్. దీంతో కాంగ్రెస్ ఖాతాలో ఓటముల సంఖ్య పెరుగుతూ పోతోంది.
ఇదిలా ఉంటే.. పార్టీ ఓటములపై అంతర్మథనంలో పడిన కాంగ్రెస్, కారణాలను వెతికే పనిలో పడింది. దీనిపై స్పందించిన పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో ఓ మేజర్ సర్జరీ అవసరమని అభిప్రాయపడ్డారు. ఆత్మ పరిశీలన చేసుకోవడంతో పాటు పార్టీ కార్యకలాపాలు, ఓటమికి గల కారణాలపై దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఇలాంటి ఫలితాలను ఏమాత్రం ఊహించలేదని చెప్పిన దిగ్విజయ్.. తాజా ఫలితాలు తీవ్ర అసంత్రుప్తికి గురిచేశాయని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక మాత్రమే చెప్పుకోదగ్గ రాష్ట్రం. మిగతా రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయా, మిజోరం, చిన్న రాష్ట్రాలే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ సారథి ఎవరన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాహుల్ పెద్దగా ప్రభావం చూపించకపోతుండడంతో, ప్రియాంక గాంధీని తెరపై తీసుకురావాలనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రియాంకను పార్టీ తరుపున యూపీ బరిలో దింపడం కంటే, ఆమెను జాతీయ స్థాయిలో కొనసాగించడం వల్లే పార్టీకి ఎక్కువ లబ్ది చేకూరే అవకాశం ఉందనేది పార్టీ వర్గాల్లో కొందరి అభిప్రాయం.
కాగా.. సిద్దాంతపరమైన తప్పులను సవరించుకోకుండా, ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా పెద్దగా ఉపయోగముండదనేది మరికొందరి వాదన. చూడాలి మరి కాంగ్రెస్ భవిష్యత్ ఎలా ఉండబోతుందో..!












Click it and Unblock the Notifications