అమ్మా! ఈ పేర్లు ఏంటి?: మండిపడిన విజయ్ కాంత్
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న టాస్మాక్ మద్యం దుకాణాల పేర్లును మార్చాలని డీఎండీకే అధినేత, ప్రతిపక్ష నేత విజయకాంత్ డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో ఎక్కడ చూసినా అమ్మా బోర్డులు, ఏ టీవీ చూసినా అమ్మ, ఏ పథకం పేరు చూసినా అమ్మా అని ముందు ఉందని మండిపడ్డారు.
నిత్యం అమ్మా అమ్మా అంటు భజన చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే తమిళనాడులోని టాస్మాక్ మద్యం దుకాణాల పేర్లను మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నడుపుతున్నఇక్కడి వైన్ షాప్ లకు అమ్మా టాస్మాక్ వైన్ షాప్ లు అని నామకరణం చెయ్యాలని అధికార పార్టీ నాయకులకు చురకలు అంటించారు.
తమిళనాడులో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అందులో డీఎండీకే కూడా ఉంది. రెడ్ హిల్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తరువాత విజయ్ కాంత్ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ మీద విరుచుకుపడ్డారు.
ఏ పథకం చూసినా అమ్మా అనే పేరు ముందు ఉంటుందని, ఏ నోట విన్నా అమ్మ ఈ పథకం అమలు చేసిందని, ఈ కార్యక్రమం మొదలు పెట్టారని, నిత్యం వారి భుజాలు వారే తట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే మద్యం దుకాణాలకు మాత్రం అమ్మ పేరు పెట్టడం మరిచిపోయినట్లు ఉన్నారని విజయ్ కాంత్ వ్యంగంగా అన్నారు.