పుట్టినరోజు నాడే పొట్టనబెట్టుకున్న కరోనా: డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత: స్టాలిన్‌కు కుడిభుజంగా
చెన్నై: తమిళనాడులో కరోనా కట్టలు తెంచుకుంది. వీర విజృంభణ చేస్తోంది. ప్రజలనే కాదు.. ప్రజా ప్రతినిధులను కూడా వదిలి పెట్టట్లేదు. కరోనా వైరస్ వల్ల తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ డీఎంకేకు చెందిన సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే జే అన్బళగన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. చెన్నైలోని రేలా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. విషాదకరమేమిటంటే- బుధవారం ఆయన పుట్టినరోజు. అదే రోజు ఆయనను కరోనా వైరస్ పొట్టనబెట్టుకుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడిన కారణంగా కొద్దిరోజుల కిందట ఆయన రేలా ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆయనకు కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆయనను ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. అదే సమయంలో కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తాయి. చికిత్స కొనసాగుతున్న సమయంలోనే కిడ్నీ సమస్యలు తీవ్రం అయ్యాయి. దీనితో ఆయన ఆరోగ్య పరిస్థితి సంక్లిష్టంగా మారినట్లు రేలా ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నామని చెప్పారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు.

పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున కన్నుమూశారు. గ్రేటర్ చెన్నై పరిధిలోని చెపాక్-ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్బళగన్ విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థిగా వరుసగా మూడుసార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు కుడిభుజంగా ఆయనకు పేరు ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రచార బాధ్యతలను అన్బళగన్ పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా- ఒండ్రినైవొమ్ వా (మనమంతా ఏకమౌదాం) పేరుతో అన్ని వర్గాలను ఏకం చేయడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని డీఎంకే చేపట్టింది. దీనికి అన్బళగన్ నేతృత్వాన్ని వహిస్తున్నారు.
இடியும் மின்னலும் ஒருசேர இறங்கியது!
— M.K.Stalin (@mkstalin) June 10, 2020
மக்கள் பணியில் அர்ப்பணித்துக்கொண்டு, தியாக தீபமாக சுடர்விட்டொளிரும் சகோதரர் @JAnbazhagan ஐ எப்படி மறப்பேன்? நானே தேம்பி அழும் நிலையில், அன்புவின் குடும்பத்தார்க்கும், உடன்பிறப்புகளுக்கும் எப்படி ஆறுதல் சொல்வேன்? இனி எப்போது பாச முகம் காண்பேன்?
అన్బళగన్ మరణం పట్ల ఎం కే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు. తన కుటుంబ సభ్యుడిని కోల్పోయానని వ్యాఖ్యానించారు. అన్బళగన్ డీఎంకే పార్టీ పట్ల, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి పట్ల అత్యంత విశ్వాసపాత్రుడైన నాయకుడని పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటును మిగిల్చిందని అన్నారు. దూరదృష్టితో వ్యవహరించగల సమర్థుడైన ప్రజా నేతను కోల్పోయామని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications