వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Dolo 650: ఈ ఔషధాన్ని ప్రజలకు సూచించాలని డాక్టర్లకు రూ.1000 కోట్లు ఇచ్చారా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
Dolo 650

''కోవిడ్-19 సోకినప్పుడు నాకు కూడా డోలో-650 వేసుకోవాలని సూచించారు. మీరు చెప్పేది వింటుంటే కాస్త వింతగా అనిపిస్తోంది. కానీ, ఇది కాస్త తీవ్రమైన సమస్యే.’’

డోలో-650 మాత్రల గురించి ప్రస్తావించిన ఓ కేసు విచారణ సమయంలో సుప్రీం కోర్టులో న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు ఇవీ. మరోసారి ఈ ఔషధం వార్తల్లో నిలుస్తోంది.

డోల్-650ని సూచించాలని వైద్యులకు సదరు ఫార్మాస్యూటికల్ సంస్థ రూ.1000 కోట్లను బహుమతుల రూపంలో అందించిందని తాజాగా మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆదాయపు పన్ను విభాగం విడుదల చేసినట్లుగా చెబుతున్న ఓ ప్రకటన ఆధారంగా ఈ వార్తలు వస్తున్నాయి. సుప్రీం కోర్టులో విచారణ సమయంలోనూ ఈ ప్రకటన ప్రస్తావనకు వచ్చింది.

డోలో-650

అయితే, ఈ ఆరోపణలను డోలో-650ను తయారుచేస్తున్న మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఖండించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) జైరాజ్ గోవింద్ రాజు ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ రికార్డు స్థాయి విక్రయాలను నమోదుచేసి, ఈ ఔషధం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

కోవిడ్-19 లక్షణాలను కట్టడి చేసేందుకు విరివిగా ఉపయోగించిన ఔషధాల్లో డోలో-650 కూడా ఒకటి. దీని పేరు వార్తల్లో నిలిచిన ప్రతిసారీ ప్రజల్లో ఆసక్తి కూడా పెరుగుతోంది.

తాజా పిటిషన్ ఏమిటి?

సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న తాజా పిటిషన్‌ను ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసింది.

మార్కెటింగ్ విధానాలు, ఫార్ములేషన్లలో ఫార్మా కంపెనీలన్నీ ఒకేరకమైన విధానాలను అనుసరించేలా చూడాలని ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం తీసుకురాకపోతే, సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని దీనిలో అభ్యర్థించారు.

తమ ఔషధాలను ప్రమోట్ చేసుకోవడానికి మార్కెటింగ్‌పై ఫార్మా సంస్థలు భారీగా ఖర్చు పెడుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ప్రమోషన్లకు లోబడే వైద్యులు ఆ మందులను సిఫార్సు చేస్తున్నారని వివరించారు.

ఈ విషయంపై పిటిషనర్ల న్యాయవాది సంజయ్ పారీఖ్ బీబీసీతో మాట్లాడారు. ''తమ మందులను సిఫార్సు చేయాలని వైద్యులకు కంపెనీలు భిన్న రకాలు బహుమతులు ఇస్తుంటాయి. ఈ విషయంలో ఫార్మా సంస్థలు లంచాలు ఇస్తున్నట్లే లెక్క. ఎందుకంటే వైద్యులకు ఉచిత గిఫ్టులు ఇవ్వడం కూడా లంచం ఇవ్వడం లాంటిదే. అందుకే ఈ విషయంలో అందరికీ వర్తించేలా నిబంధనలు తీసుకురావాలి. మేం 2008-2009 నుంచి ఈ డిమాండును ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. కానీ, ఎలాంటి ఫలితమూ లభించలేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

డోలో-650ను ఎందుకు ప్రస్తావించారు?

మార్కెటింగ్ విషయంలో భారత్‌లో ఫార్మా కంపెనీలన్నింటికీ వర్తించే నిబంధనలు ఎందుకు అవసరమో పిటిషనర్ల తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో వాదించారు. ఈ సందర్భంగా ఆయన చాలా ఉదహరణలు కూడా చెప్పారు.

అలా కరోనావైరస్ వ్యాప్తి సమయంలో విరివిగా ఉపయోగించిన డోలో-650 పేరు కేసు విచారణ సమయంలో ప్రస్తావనకు వచ్చింది.

డోలో-650పై మీడియాలో వచ్చిన కొన్ని వార్తలను కోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ఆ వార్తల్లో వైద్యులకు సదరు ఫార్మా సంస్థ రూ.1000 కోట్లు బహుమతుల రూపంలో అందించిందనే వార్త కూడా ఉంది.

ఈ విషయంపై ఆదాయపు పన్ను విభాగం చెప్పిన గణాంకాలుగా పేర్కొంటూ జులై 13న మీడియాలో వార్తలు వచ్చాయి.

''బెంగళూరులోని ఒక పెద్ద ఫార్మా సంస్థలో తనిఖీలు చేపట్టాం. సేల్స్, ప్రమోషన్స్ పేరుతో వైద్యులకు ఆ సంస్థ రూ.1000 కోట్లు ఇచ్చింది. ఈ విషయంలో విచారణ కొనసాగుతోంది’’అని ఆ వార్తలో అధికారులు పేర్కొన్నారు. అయితే, ఇక్కడ నేరుగా మైక్రో ల్యాబ్స్ పేరును ప్రస్తావించలేదు.

అయితే, ఆ తర్వాత పీటీఐ రాసిన ఒక కథనంలో మైక్రో ల్యాబ్స్ పేరును ప్రస్తావించారు.

మైక్రోల్యాబ్స్ ఏం అంటోంది?

ఈ విషయంలో మైక్రో ల్యాబ్స్ వైఖరిని తెలుసుకునేందుకు సంస్థను బీబీసీ సంప్రదించింది.

''సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌లో డోలో-650 పేరును నేరుగా ప్రస్తావించలేదు. వెయ్యి కోట్లను వైద్యలకు ఉచితంగా ఇవ్వడమా? ఇదేదో అసత్య ప్రచారంలా ఉంది’’అని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) జైరాజ్ గోవింద్ రాజు అన్నారు.

''కరోనావైరస్ వ్యాప్తి నడుమ డోలో-650ను విక్రయించడం ద్వారా మేం రూ.350 కోట్లు సంపాదించాం. ఇలాంటి సందర్భాల్లో అసలు మార్కెటింగ్ కోసం రూ.1000 కోట్లు ఎలా ఖర్చు చేస్తాం. అసలు ఒక సంస్థ కేవలం మార్కెటింగ్ మీదే రూ.1000 కోట్లు ఎలా ఖర్చు పెట్టగలదు.. మీరైనా ఆలోచించండి’’అని ఆయన అన్నారు.

''డోలో-650ను ధరల నియంత్రణ నిబంధనల కింద భారత్‌లోనే తయారుచేస్తున్నాం. ధరల నియంత్రణ నిబంధనలు మాకు వర్తించవని చెప్పడంలో ఎలాంటి నిజమూలేదు’’అని ఆయన వివరించారు.

''ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే.. మా ఔషధం ధర పెంచలేదు. ఏళ్లుగా మేం ఒక్కో ట్యాబ్లెట్‌ను రూ.2కే అమ్ముతున్నాం. ఇప్పటికీ దాని ధర అలానే ఉంది’’అని ఆయన చెప్పారు.

''కరోనావైరస్ వ్యాప్తి సమయంలో ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కానీ, మేం ప్రజలకు అదే ధరకు ఔషధం అందుబాటులో ఉంచేందుకు కృషి చేశాం. ఎక్కడా ఔషధం కొరత గానీ, ధరల పెరుగుదల కానీ, లేకుండా చూసుకున్నాం. ఇప్పుడు డోలో విశేష ప్రజాదరణ పొందడంతో... అన్ని వివాదాల్లోకి దీన్ని లాగుతున్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, జులైలో తమ కార్యాలయంలో ఆదాయపు పన్ను విభాగం అధికారులు తనిఖీలు చేశారనే వార్తలను గోవింద్ రాజు ధ్రువీకరించారు. ''ఏళ్ల నుంచి మా దగ్గరవున్న పత్రాలన్నీ అధికారులు తీసుకెళ్లారు. బహుశా మీడియాలో చెబుతున్న రూ.1000 కోట్లు ఒక ఏడాదివి అయ్యుండకపోవచ్చు’’అని ఆయన అన్నారు.

అయితే, ఎన్ని ఏళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు పెట్టారో ఆయన వెల్లడించలేదు.

చట్టాలు ఏం చెబుతున్నాయి?

భారత్‌లోని ఫార్మా కంపెనీల మార్కెటింగ్, ప్రమోషన్‌లకు సంబంధించి ఒక ''వాలంటరీ కోడ్’’ అమలులో ఉంది. దీన్ని దేశంలోని ఫార్మా సంస్థలే రూపొందించాయి.

వచ్చే 6 నెలలో ఫార్మా సంస్థలు స్వచ్ఛందంగా ఒక కోడ్‌ను రూపొందించి, దానికి కట్టుబడి ఉండాలని డిసెంబరు 12, 2014లో కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ తర్వాత కేంద్రం ఈ కోడ్‌ను సమీక్షించి, కొన్ని మార్పులు కూడా సూచించింది.

''ఆ తర్వాత, దీనికి సంబంధించి కేంద్రం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. కానీ, అది చట్టరూపం దాల్చలేదు’’అని పిటషన్‌దారుల న్యాయవాది తెలిపారు.

గత ఆగస్టులో వాలంటరీ కోడ్ కొనసాగుతుందని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మరోవైపు ''వాలంటరీ కోడ్‌తోపాటు మరో రెండు చట్టాలు కూడా ప్రమోషన్, మార్కెటింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో కోర్టులో ఉంది. అందుకే ఇప్పుడు మరో చట్టం తీసుకురాలేం’’అని ప్రభుత్వం తెలిపింది.

తాజా విచారణ అనంతరం మరోసారి పది రోజుల్లో ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని సుప్రీం కోర్టు సూచించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Dolo 650: Doctors were given Rs.1000 crores to prescribe this medicine to people
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X