ఎవరికి వారే: కన్నుగీటడంతో కారు ఎక్కి ఊగిపోయిన జ్యోతి, సెల్ డబ్బు వసూల్
లక్నో: ఎవరికి వారే అన్యాయాన్ని ఎదుర్కోవలసిన సమయం వచ్చిందని జ్యోతి పాండే అన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సమాజ్ వాది పార్టీ నేతలకు ఆమె చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించారు.
పోలీసుల మీద తనకు నమ్మకం లేదని, వాళ్ల నుంచి ఎటువంటి న్యాయం ఆశించడంలేదన్నారు. తన సెల్‌ఫోన్ ఖరీదు ఇచ్చేసినందున ఇకపై మాట్లాడవలసింది ఏమీ లేదన్నారు. ఎవరికి వారే అన్యాయాన్ని ఎదుర్కోవాలన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలెయ్యాలన్నారు.
పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారని, ఏమీ చేయలేమని చేతులెత్తేశారని చెప్పారు. అయితే మీరు వెళ్లండి జనం చూసుకుంటారని తాను చెప్పానని అన్నారు.
ఇదిలా ఉండగా, జ్యోతి పాండే వైపు అసభ్యంగా ప్రవర్తించిన సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. అయితే సదరు నేత తమ పార్టీ సభ్యుడు కాదని సమాజ్‌వాది పార్టీ ప్రకటించింది.

జ్యోతి పాండే అధికార పార్టీ నేతలను నిలదీసిన విషయం తెలిసిందే. కారు ఎక్కి అద్దాలు పగలగొట్టింది. పగిలిన సెల్‌ఫోన్ డబ్బులు చెల్లించేవరకు వదిలి పెట్టేదిలేదని ఆమె భీష్మించుకు కూర్చోవడంతో వారు ఇవ్వక తప్పలేదు. డబ్బులు వసూలు చేసిన తర్వాతే కారు దిగింది.
ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఆ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఝాన్సీరాణి అని కొందరు పిలిస్తే, సాద్వీ జ్యోతీ పాండే అని కొందరు కీర్తిస్తున్నారు.
జ్యోతిపాండే తన సోదరితో స్కూటీపై వెళుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగారు. అదే సమయంలో సమాజ్‌వాది పార్టీ నేత ఒకరు కారులో వెళుతున్నారు. అతని సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు ఆమెను చూసి కన్ను గీటారు. అది కారు అద్దంలోని స్పష్టంగా కనిపించింది.
దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కారుకు అడ్డంగా నిలుచుని వారిని నిలదీసింది. తన సెల్‌ఫోన్‌లో ఫోటో తీయబోయింది. సెక్యూరిటీ సిబ్బంది ఆమె ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టారు. ఫోన్ పగిలిపోవడంతో ఆమెకు కోపం వచ్చింది. అంతే కారుపైకి ఎక్కి, గొడవచేస్తూ ముఖ్యమంత్రి తనను ఏమీ చేయలేరని సవాల్ విసిరింది.
కారు అద్దం పగులగొట్టింది. తన సెల్ ఫోన్ కొని ఇచ్చే వరకు కారు దిగనని చెప్పింది. ఆమెను సమాధానపరిచేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా ఆమె దిగిరాలేదు. దాంతో ఎస్పీ నేత రూ.6,500లు ఆమెకు ఇచ్చాడు. దాంతో ఆమె అక్కడి నుంచి కదిలింది. ఆమె చూపిన అసమాన ధైర్యసాహసాన్ని ప్రజలు మెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications