చైనాలో ట్రంప్ కండోమ్స్.. ట్రంప్ టాయిలెట్స్..
2000సంవత్సరం నుంచి ట్రంప్ ఉత్పత్తులు చైనా మార్కెట్లో ఉన్నాయి. ఆ ఉత్పత్తులకు ట్రంప్ పేరు పెట్టడం వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది.
బీజింగ్: చైనాలో ట్రంప్ ఉత్పత్తులు ఫేమస్. ట్రంప్ టాయిలెట్స్, ట్రంప్ కండోమ్స్, ట్రంప్ పెయింటింగ్స్.. ఇలా చాలా రకాలు. అయితే ట్రంప్ పేరుంది కదా! అని ఇవన్నీ ట్రంప్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులనుకుంటే పొరబడ్డట్టే.
2000సంవత్సరం నుంచి ట్రంప్ ఉత్పత్తులు చైనా మార్కెట్లో ఉన్నాయి. ఆ ఉత్పత్తులకు ట్రంప్ పేరు పెట్టడం వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది. పేకముక్కల్లో అదృష్టాన్ని తీసుకొచ్చే పేకముక్కను 'ట్రంప్ కార్డు' అని సంబోధిస్తారు. వినడానికి ఇదేదో బాగుందే అని భావించిన కొంతమంది వ్యాపారవేత్తలు 'ట్రంప్' పేరును తమ వ్యాపార ఉత్పత్తుల ట్రేడ్ మార్క్ గా రిజిస్టర్ చేయించుకున్నారు.
అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక 'ట్రంప్' ట్రేడ్ మార్క్ కోసం వ్యాపారవేత్తల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. మావో యాంగ్ జిన్ అనే వ్యాపారవేత్త తమ సంస్థ ద్వారా విక్రయించే మహిళల చర్మ ఉత్పత్తులకు ట్రంప్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అతనిలో ఆనందం ఆవిరైపోయింది. ట్రంప్ ట్రేడ్ మార్క్ తో ఎక్కువమంది వ్యాపారవేత్తలు దరఖాస్తు చేసుకోవడంతో ఆ ట్రేడ్ మార్క్ పై ఇక ఆశలు వదిలేసుకున్నట్టుగా మావో యాంజ్ జిన్ తెలిపారు.
ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కార్యాలయవర్గాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. ఓ ప్రముఖ వ్యక్తి పేరును తమ ఉత్పత్తుల ట్రేడ్ మార్క్ గా పెట్టుకున్నప్పుడు నాణ్యతా విషయాల్లో నిక్కచ్చిగా ఉండకపోతే.. ఆ పేరుకు చెడ్డపేరు వచ్చే అవకాశమున్నందునా.. చాలావరకు దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్టుగా ట్రేడ్ మార్క్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
కాగా, ట్రంప్ ట్రేడ్ మార్క్ కోసం ఏకంగా డొనాల్డ్ ట్రంపే ప్రయత్నించినప్పటికీ చైనా ట్రేడ్ మార్క్ వర్గాలు అందుకు ఒప్పుకోలేదు. గడిచిన పదేళ్లలో పెట్ కేర్ ప్రొడక్ట్స్ నుంచి కంప్యూటర్ సాఫ్ట్ వేర్ వరకు దాదాపు 126ఉత్పత్తులకు ట్రంప్ ట్రేడ్ మార్క్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు.
2006లో చైనాలో హోటళ్లతో పాటు రెసిడెన్షియల్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలన్న ఉద్దేశ్యంతో ట్రంప్ ఎస్టేట్ ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్పటికే 'ట్రంప్ ఎస్టేట్' ట్రేడ్ మార్క్ ను డాంగ్ వీ అనే చైనా వ్యాపారికి కేటాయించినందునా.. డొనాల్డ్ ట్రంప్ కు నిరాశ తప్పలేదు.
ఇన్నాళ్లకు నెరవేరుతున్న ప్రయత్నం:
కాగా, ట్రంప్ ట్రేడ్ మార్క్ కోసం ఇన్నాళ్లు కోర్టులో సవాల్ చేస్తూ వస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే సఫలమవుతున్నట్టుగా తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో గత నవంబర్ 13న చైనా వ్యాపారి డాంగ్ వీ రిజిస్టర్ చేయించుకున్న ట్రేడ్ మార్క్ చెల్లదని కోర్టు తీర్పు వెలువడింది.
కోర్టు తీర్పుతో డాంగ్ వీ రిజిస్ట్రేషన్ రద్దు కావడంతో ఆ ట్రేడ్ మార్క్ ను డొనాల్డ్ ట్రంప్ వ్యాపార ఉత్పత్తులకు కేటాయించే అవకాశముంది. ఈ విషయంలో చైనా ప్రభుత్వం పరోక్షంగా ట్రంప్ కు మద్దతునిచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదే గనుక నిజమైతే.. త్వరలోనే చైనా మార్కెట్ లో ట్రంప్ టాయ్ లెట్స్, ట్రంప్ కండోమ్స్.. ఇలా రకరకాల ఉత్పత్తులు ఆ దేశంలో సందడి చేయనున్నాయి.












Click it and Unblock the Notifications