ట్రంప్ ప్రమాణానికి ఆయనను పంపించనున్న మోదీ
Donald Trump's swearing-in ceremony: ఇంకొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డొనాల్డ్ ట్రంప్. గత ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌ను చిత్తు చేశారు.
ఈ నెల 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాజధాని వాషింగ్టన్ డీసీలో ఆ దేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమౌతుంది.

ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు డొనాల్డ్ ట్రంప్-జేడీ వాన్స్ ఇనాగ్యురల్ కమిటీ ఆహ్వాన పత్రికలను పంపించింది. భారత్ సహా జీ20, బ్రిక్స్ ప్లస్.. వంటి అత్యున్నత గ్రూప్‌లల్లో సభ్య దేశాలకూ ఈ ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అందాయి.
ఈ నేపథ్యంలో భారత్ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్‌తో మోదీకి సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టెక్సాస్‌లో హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారాయన.

అదే థీమ్‌తో 2020 ఫిబ్రవరిలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనూ నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ రెండు భారీ సమావేశాలు కూడా మోదీ- ట్రంప్ మధ్య ఉన్న సత్సంబంధాలకు అద్దం పట్టాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ హాజరవుతారని అంచనావేశారు.
వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ కార్యక్రమానికి మోదీ వెళ్లట్లేదు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ భారత్ తరఫున ఇందులో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విదేశాంగ మంత్రత్వ శాఖ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. జైశంకర్ షెడ్యూల్ ఇంకా ఖరారు చేయాల్సి ఉందని తెలిపింది.












Click it and Unblock the Notifications