ఈ 6 మార్గాల్లో డబ్బులు వస్తే రూ.1 కూడా ఐటీ కట్టాల్సిన అవసరంలేదు
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పరిమితికి మించిన ఆదాయంపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా ఈ నిబంధన వర్తిస్తుంది. ఐటీ రిటర్న్స్ సీజన్ కావడంతో ఫైల్ చేసేవారు తమ ఆదాయ వివరాలను తెలపాల్సి ఉంటుంది. తమకు ఏవిధంగా, ఏయే రూపాల్లో ఆదాయం వచ్చింది అనే విషయాన్ని స్పష్టంగా వివరించాలి. సేవింగ్స్ ద్వారా వచ్చే వడ్డీ, ఇంటి అద్దె, వ్యాపారం, వేతనం, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు.. ఇలా ప్రతి ఆదాయానికి పన్ను ఉంటుంది.
ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను కట్టాల్సిన పనిలేదు. అదే పాత పన్ను విధానం ఎంచుకుంటే రూ.5 లక్షల వార్షికాదాయం వరకు పన్ను ఉండదు. కొన్ని మార్గాల్లో వచ్చిన ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఐటీ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం ఏయే రకాల ఆదాయాలకు పన్ను ఉండదు అనే విషయాన్ని తెలుసుకుందాం.

వ్యవసాయం ద్వారా ఆదాయం
మనదేశం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టం 1961లో మినహాయింపునిచ్చింది. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తీసుకురాలేదు. వ్యవసాయ భూమి ఉన్నా, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలద్వారా ఆదాయం వస్తే రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
హిందూ అవిభాజ్య కుటుంబం
హిందూ అవిభాజ్య కుటుంబం నుండి స్వీకరించినా లేదంటే వారసత్వం రూపంలో వచ్చే ఆదాయం కూడా పన్ను పరిధిలోకి రాదు. ఐటీ చట్టం సెక్షన్ 10(2) కింద పన్ను మినహాయింపు ఉంటుంది. హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన కుటుంబ ఆదాయం, స్థిరాస్తి ద్వారా వచ్చే ఆదాయం లేదంటే పూర్వీకుల ఆస్తి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉండదు.
సేవింగ్స్ అకౌంట్ వడ్డీ
సేవింగ్స్ ఖాతాలో డబ్బులుంటే ప్రతి మూడునెలలకోసారి వడ్డీ లభిస్తుంటుంది. ఐటీ చట్టం ప్రకారం ఇది ఆదాయం కిందకు వస్తుంది. సెక్షన్ 80టీటీఏ ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు. పొదుపుపై వార్షిక వడ్డీ రూ.10వేల కంటే ఎక్కువుంటే పన్ను చెల్లించాలి.
గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పనిచేసిన ఉద్యోగి అందుకున్న గ్రాట్యుటీపై పన్ను ఉండదు. ప్రయివేటు రంగంలోచేసే ఉద్యోగి అయితే టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ పొందితే నిబంధనలు వేరుగా ఉంటాయి.
వీఆర్ఎస్ ద్వారా వచ్చే డబ్బు
ఆదాయపు పన్ను చట్టంలోని రూల్ 2బీఏ ప్రకారం వీఆర్ఎస్ ద్వారా రూ.5 లక్షల వరకు వస్తే ఆ మొత్తానికి పన్ను కట్టాల్సిన పనిలేదు.
స్కాలర్‌షిప్ లేదా అవార్డ్
ఒక విద్యార్థి తన విద్యాభ్యాసం కోసం స్కాలర్‌షిప్ లేదా అవార్డు ద్వారా డబ్బు పొందితే ఐటీ చట్టంలోని సెక్షన్ 10 (16) కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. దీనికి గరిష్ట పరిమితి లేదు.












Click it and Unblock the Notifications