నన్ను లైట్ తీసుకోవద్దు! మహారాష్ట్రలో కలకలం!!
Eknath Shinde: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో లుకలుకలు తాజాగా బయటపడ్డాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యటీ సీఎం, శివసేన నేత ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ హెచ్చరికలు చేశారు.
ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశాలకు షిండే దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయితే, షిండే వర్గం ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించడంతోపాటు సచివాలయంలో వైద్య సహాయ కేంద్రాలను వేర్వేరుగా ఏర్పాటు చేసుకోవడంతో వీరిమధ్య మరింత దూరాన్ని పెంచినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో షిండే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 2022లో ప్రభుత్వాన్ని పడగొట్టిన విషయాన్ని ఆయన తాజాగా గుర్తు చేయడం గమనార్హం. అయితే, ఏక్ నాథ్ షిండే హయాంలో ఆమోదించిన ఓ ప్రాజెక్టును ఫడ్నవీస్ ప్రభుత్వం నిలిపివేసింది.
ఈ నేపథ్యంలో ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. తాను ఓ సాధారణ పార్టీ కార్యకర్తనని.. అంతేగాక, బాలాసాహెబ్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తినని షిండే చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. 2022లో అందరూ నన్ను తేలిగ్గా తీసుకున్నప్పుడు.. ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు షిండే చెప్పారు.
ఆ తర్వాత విధానసభలో చేసిన మొదటి ప్రసంగంలో దేవేంద్ర ఫడ్నవీస్ కు 200 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పానని.. 232 సీట్లు వచ్చాయని ఏక్ నాథ్ షిండే తెలిపారు. అందుకే తనను తేలిగ్గా తీసుకోవద్దని మరోసారి హెచ్చరించారు. తాను ఇది ఎవరిని ఉద్దేశించి చెబుతున్నానో వాళ్లు అర్థం చేసుకుంటారని ఏక్ నాథ్ షిండే అన్నారు. అయితే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఎలాంటి కోల్డ్ వార్ లేదని, అభివృద్ధిని అడ్డుకునేవారితోనే తన పోరాటమని చెప్పుకొచ్చారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం బీజేపీ-శివసేన (షిండే)- ఎన్సీపీ (అజిత్ పవార్)ల మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 132 స్థానాల్లో విజయం సాధించగా.. శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.












Click it and Unblock the Notifications