ఇప్పుడున్న పరిస్థితుల్లో మిజోరం వెళ్లవద్దు... అసోం ప్రజలకు ప్రభుత్వ సూచన...
సరిహద్దు వివాదం,ఘర్షణల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలెవరూ మిజోరం వెళ్లవద్దని అసోం ప్రభుత్వం సూచించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిజోరం రాష్ట్రానికి రాకపోకలు వద్దని... భద్రత రీత్యా అక్కడికి వెళ్లవద్దని తెలిపింది. వృత్తి రీత్యా మిజోరాంలో ఉంటున్న అసోం వాసులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
ఇటీవలి ఘర్షణలు,ఆరుగురు పోలీసుల మరణాన్ని గుర్తుచేసిన అసోం ప్రభుత్వం... ఇప్పటికీ మిజోరాం వైపు నుంచి రెచ్చగొట్టే చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించింది.మిజోరాం విద్యార్థులు,యూత్ ఆర్గనైజేషన్స్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నాయని ఆరోపించింది. మిజోరాం పౌరుల వద్ద ఆటోమేటిక్ వెపన్స్ భారీగా ఉన్నాయని.. అసోం పోలీసుల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో అది బయటపడిందని పేర్కొంది.

ప్రస్తుతం అసోం-మిజోరాం సరిహద్దులో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్యనున్న లైలాపూర్ బోర్డర్‌లో కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఆ బోర్డర్‌కు 100మీ. దూరంలో అటు అసోం,ఇటు మిజోరాం పోలీసుల భద్రత కొనసాగుతోంది. సాధారణ పౌరులెవరూ అటువైపు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అసోం-మిజోరాం సరిహద్దు ప్రాంతంపై రెండు రాష్ట్రాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండటంతో తరుచూ వివాదం చెలరేగుతోంది. అయితే ఇటీవల చెలరేగిన స్థాయిలో హింసాత్మక సంఘటనలు మునుపెన్నడూ చోటు చేసుకోలేదు. మిజోరాం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మరణించడంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అయితే మొదట దాడులకు దిగింది మీరంటే మీరని ఇరు రాష్ట్రాలు ఆరోపించుకున్నాయి. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశాయి.
అసోం,మిజోరాం మధ్య వివాదం అవి రెండు రాష్ట్రాలుగా విడిపోకముందు నుంచే ఉంది. బ్రిటీషర్ల కాలం నుంచే ఆ వివాదం కొనసాగుతోంది. ఈ రెండింటి మధ్య ఉన్న భూభాగంపై ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 1875 నాటి నోటిఫికేషన్ ప్రకారం సరిహద్దును గుర్తించాలని మిజోరాం వాదిస్తుంటే... 1933లో గుర్తించిన దాన్నే పరిగణలోకి తీసుకుంటామని అసోం ప్రభుత్వం వాదిస్తోంది. ఈ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఇప్పటివరకూ ఒక్క ఉమ్మడి సర్వే కూడా జరగలేదు.దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఏళ్లుగా అలాగే ఉండిపోయింది... ఇప్పటికీ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications