Messi vs Ronaldo: నెక్స్ట్ బిగ్ క్లాష్
ఫిఫా ప్రపంచకప్ లో అసాధారణ ప్రదర్శనతో సరికొత్త రికార్డులు నెలకొల్పిన అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ.. ప్రస్తుతం తన తదుపరి సమరానికి ముమ్మరంగా సిద్ధమవుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా గ్రూప్ దశలో ఆస్ట్రియాతో జరగబోయే కీలకమైన రెండో మ్యాచ్ కోసం అర్జెంటీనా జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో డల్లాస్‌లో నిర్వహించిన ట్రైనింగ్ సెషన్స్ కు సంబంధించిన ఫోటోలను మెస్సీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
తన సహచర ఆటగాళ్లతో కలిసి మైదానంలో వ్యూహాలు రచిస్తూ కనిపించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా తన తొలి గ్రూప్ మ్యాచ్‌లో అల్జీరియాపై 3-0 తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇది వన్ మేన్ షో. ఈ విజయకేతనంలో కెప్టెన్ మెస్సీ పాత్ర కీలకంగా మారింది. ఆట ప్రారంభం నుంచే మైదానంలో పట్టు సాధించిన మెస్సీ, అల్జీరియా డిఫెండర్లను ముప్పుతిప్పలు పెడుతూ మూడు గోల్స్‌తో చెలరేగిపోయాడు.

మ్యాచ్‌లో అత్యంత శక్తిమంతమైన లాంగ్-రేంజ్ షాట్‌తో మెస్సీ అర్జెంటీనాకు తొలి పాయింట్ అందించగా, ఆ తర్వాత రీబౌండ్‌ను చక్కగా గోల్‌గా మార్చి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. చివరిగా మ్యాచ్ 76వ నిమిషంలో క్లాసిక్ కర్లింగ్ స్ట్రైక్‌తో హ్యాట్రిక్‌ను పూర్తి చేసుకుని అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ ప్రపంచకప్‌లో టైటిల్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న అర్జెంటీనా నేడు డల్లాస్ లో ఆస్ట్రియాతో జరిగే రెండో మ్యాచ్‌లో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న మెస్సీ సేన, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి నాకౌట్ దశకు చేరుకోవాలని భావిస్తోంది.
మరోవైపు.. ఈ వరల్డ్ కప్ లో ఉజ్బెకిస్థాన్‌తో జరగబోయే కీలకమైన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌కు పోర్చుగల్ సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్‌లో డీఆర్ కాంగోతో తలపడి డ్రాతో సరిపెట్టుకున్న ఈ జట్టు.. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు కెప్టెన్, స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డొ సోషల్ మీడియా వేదికగా జట్టు సన్నద్ధతను తెలియజేస్తూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. టీమ్ మేట్స్ తో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్న ఫొటోలను రొనాల్డొ షేర్ చేశాడు. "లక్ష్యం వైపే మా దృష్టి" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
తొలి మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన రొనాల్డో తదుపరి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయాలని ఎంతగానో తపిస్తున్నట్లు ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది. 41 ఏళ్ల ఈ దిగ్గజ ఆటగాడు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఎలాగైనా తన ముద్ర వేయాలని భావిస్తున్నాడు. డీఆర్ కాంగోతో జరిగిన తొలి మ్యాచ్‌లో రొనాల్డో ఆటతీరుపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్ 1-1తో డ్రా అయింది. ప్రత్యర్థి డిఫెండర్లు అతన్ని కట్టిపడేశారు. మ్యాచ్ మొత్తం మీద 25 సార్లు మాత్రమే బంతిని టచ్ చేయగలిగాడు.
రొనాల్డో సుదీర్ఘ ప్రపంచకప్ కెరీర్‌లోనే అత్యంత తక్కువగా బంతిని తాకిన రెండో మ్యాచ్‌గా ఇది నమోదైంది. మూడు షాట్లు కొట్టినప్పటికీ, అవి కూడా లక్ష్యాన్ని చేరుకోలేదు. అంతర్జాతీయ టోర్నమెంట్లలో రొనాల్డో ఫామ్‌పై ఇప్పుడు ఆందోళనలు పెరుగుతున్నాయి. మేజర్ ఈవెంట్లల్లో వరుసగా 11 మ్యాచ్‌లలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. రొనాల్డో అనుభవం, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకున్న ఛరిష్మా దృష్ట్యా ఈ గణాంకాలు అభిమానులను కాస్త కలవరపెడుతున్నాయి. ఉజ్బెకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ లోటు తీరుతుందని ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications