వైజాగ్ మారథాన్... రూ. 12 లక్షలు గెలుచుకునే అవకాశం.. పరుగు మొదలెట్టండి!
విశాఖ నగరంలో ఫిట్నెస్ ప్రేమికులు, క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైజాగ్ మారథాన్ 5వ ఎడిషన్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ సంవత్సరం నవంబర్ 29వ తేదీన వైజాగ్ నగరంలో సముద్ర తీరం వెంట ఈ ప్రతిష్టాత్మక పోటీలు జరగనున్నాయి. ఈ సంవత్సరం వైజాగ్ లోని రన్నర్స్ ను ప్రోత్సహించడం కోసం భారీగా నగదు బహుమతులు ప్రకటించడం ఆసక్తిగా మారింది.
వైజాగ్ మారథాన్ 5వ ఎడిషన్
సుందరమైన విశాఖ నగరంలో సముద్ర తీరం వెంట ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా వైజాగ్ మారథాన్ నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ కు ఈ సంవత్సరం కూడా ప్రజాదరణ బాగా పెరిగింది. ప్రొఫెషనల్ అథ్లెట్స్ తో పాటు సాధారణ ప్రజలు, విద్యార్థులు, వయోజనులు, ఐటి ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా ఈ 5వ ఎడిషన్ ను రూపొందించారు.

మారథాన్ పోటీల వివరాలు ఇవే
ప్రధానంగా 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, ఐదు కిలోమీటర్లు, మూడు కిలోమీటర్ల రన్ విభాగాలు ఇందులో ఏర్పాటు చేశారు. అనుభవం ఉన్న ప్రొఫెషనల్ రన్నర్ లకు 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అనుకూలంగా ఉండగా, కొత్తగా ప్రారంభించే వారికి, ఫ్యామిలీస్ కి 5K, 3K విభాగాలు అనువైనవి. ఎవరైనా సరే తమ ఫిట్నెస్ స్థాయిని బట్టి ఎంచుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఈ మారథాన్ సాగుతుందిలా
ఈ మారథాన్ ఆర్కే బీచ్ రోడ్ నుండి ప్రారంభమై సముద్ర తీరం వెంబడి భీమిలి వరకు సాగుతుంది. ఉదయపు చల్లని సముద్రపు గాలి, అందమైన ప్రకృతి దృశ్యం మధ్య పరుగులు తీసే అనుభవం ఈ మారథాన్ లో పాల్గొనే వారికి ప్రత్యేకంగా గుర్తుంటుంది. అంతేకాదు ఇంత భారీగా ప్లాన్ చేసిన మారథాన్ కు అంతే భారీగా నగదు బహుమతులు కూడా ఉన్నాయి.
విజేతలకు 12 లక్షల రూపాయల ప్రైజ్ మనీ
విజేతలకు 12 లక్షల రూపాయల ప్రైజ్ మనీ తో పాటు, పాల్గొనే ప్రతి రన్నర్ కు బిబ్ లు, ఈవెంట్ టీ షర్ట్ లు, టైమింగ్ చిప్ లు, ఫినిషర్ మెడల్స్ అందజేస్తారు. అంతేకాదు మార్గం మొత్తం మెడికల్ క్యాంపులు, హైడ్రేషన్ పాయింట్స్, అంబులెన్సులు కూడా అవైలబుల్ గా ఉంచుతారు. పదివేల మందికి పైగా రన్నర్లు పాల్గొనేలాగా దీనిని రూపొందించారు. నవంబర్ 29 ఆదివారం కావడంతో భారీగానే రన్నర్లు పాల్గొంటారని అంచనా.
ఫిట్నెస్ మ్యాప్ లో విశాఖకు స్థానం
ఈ ఈవెంట్ విశాఖపట్నం ను ఫిట్నెస్ మ్యాప్ లో నిలబెట్టడమే కాకుండా, తీరప్రాంత పర్యాటకానికి కూడా కొత్త ఊపును ఇస్తుంది. నగర వాసులతో పాటు దేశవ్యాప్తంగా అథ్లెట్లు ఈ ఈవెంట్ లో పాల్గొంటారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. మరి ఎందుకు ఆలస్యం లక్షల విలువైన నగదు బహుమతులు గెలుచుకోవడానికి విశాఖ సాగర తీరాన పరుగు పెట్టండి.













Click it and Unblock the Notifications