ఎల్లుండి బంద్, పొరుగు రాష్ట్రంలో నీళ్ల కోసం మొదలైన మహా పోరు!
ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఏళ్లుగా సాగుతున్న నీటి వివాదాలు మళ్లీ అగ్గి రాజేసాయి. తమ హక్కుల సాధన కోసం కన్నడ ఉద్యమకారులు సమరశంఖం పూరించారు. వచ్చే ఆగస్టు 13న కర్ణాటక వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన మాతృభాషా సంఘాలు, దానికి ముందస్తు హెచ్చరికగా సరిహద్దుల్లో రాకపోకలను స్తంభించిపోయేలా చేశాయి. మేకదాటు, మహదాయి, కళసా బండూరి వంటి కీలక సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం హింసాత్మక రూపు దాల్చేలా కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవాంతరాలను ఎదుర్కొంటున్నారు.
మహా బంద్‌కు సమరభేరి మోగిస్తూ కన్నడ చలవళి నేత వాటాల్ నాగరాజ్ నేతృత్వంలో సోమవారం ఉదయం నుంచే నిరసనలు ఉధృతమయ్యాయి. కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లోని అత్యంత బిజీ రహదారి అయిన 'అట్టిబెల్లె' చెక్‌పోస్ట్ వద్ద ఉద్యమకారులు బైఠాయించారు. దీంతో తమిళనాడు నుంచి కర్ణాటకలోకి, అలాగే బెంగళూరు వైపు నుంచి తమిళనాడు వైపు వెళ్లే వేలాది లారీలు, బస్సులు, ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సరిహద్దుల్లో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

3,000 సంఘాల మద్దతు: బంద్‌కు సర్వం సిద్ధం
గురువారం కర్ణాటకను పూర్తిగా స్తంభింపజేస్తామని వాటాల్ నాగరాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే దాదాపు 2,000కు పైగా కన్నడ అనుకూల, రైతు సంఘాలు ఈ బంద్‌కు మద్దతు తెలిపాయని, ఆ సంఖ్య 3,000 మార్కును చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరు, మైసూర్ నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా రంగాలు తమ వ్యాపారాలను బంద్ చేసి పోరాటానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం మేకదాటు ప్రాజెక్టుపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి విజ్ఞప్తి నిరాకరణ.. ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూతపడతాయి?
పరిస్థితి చేయిదాటకుండా చూసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బంద్ పిలుపును విరమించుకోవాలని కన్నడ సంఘాలకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విజ్ఞప్తిని నాగరాజ్ తోసిపుచ్చారు. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో మినహా బెంగళూరు నగరం, ఇతర జిల్లాల్లో నిత్యజీవితం సాధారణంగానే ఉంది. అయితే ఆగస్టు 13న మాత్రం అంతర్రాష్ట్ర రవాణా, అంతర్గత ప్రజా రవాణా, వ్యాపార సముదాయాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.














Click it and Unblock the Notifications