ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము: ఈమె ఎవరంటే..?
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నేటి సాయంత్రం తమ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. ప్రతిపక్షాలు యశ్వంత్ సిన్హాను ఉమ్మడి అభ్యర్థిగా పేర్కొన్న కొన్ని గంటల తర్వాత.. రాష్ట్రపతి ఎన్నికలకు పార్టీ అభ్యర్థిపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా బీజేపీ పార్లమెంటరీ బోర్డు మంగళవారం సమావేశాన్ని నిర్వహించింది.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును కాషాయ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు. అనేక పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ.. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

కాగా, 'మేము ఎన్డీఏ, యూపీఏలోని ఇతర పార్టీలతో కూడా టచ్‌లో ఉన్నాము. యూపీఏలోని పార్టీలతో కూడా రాజ్‌నాథ్ సింగ్ చర్చలు జరిపారు. నేను కొందరితో టచ్‌లో ఉన్నాను. యూపీఏ పార్టీలు, కొందరు రాజ్‌నాథ్ సింగ్ టచ్‌లో ఉన్నారు' అని తెలిపారు.
జార్ఖండ్ మాజీ గవర్నర్‌గా పనిచేసిన ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అన్నారు. మంత్రిగా, గవర్నర్‌గా ఆమె ఉత్తమ సేవలందించారని కొనియాడారు.
1958, జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైడపోసిలో ద్రౌపది ముర్ము జన్మించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు టీచర్ గా పనిచేశారు. 2000-2004 వరకు ఒడిశా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత గవర్నర్‌గా పనిచేశారు.
ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ, బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మార్చి 6, 2000 నుంచి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం, రవాణా శాఖకు స్వతంత్ర రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.
ఆమె తన రాజకీయ జీవితాన్ని కౌన్సిలర్‌గా ప్రారంభించి, తరువాత రాయంగ్‌పూర్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లేదా NAC వైస్-ఛైర్‌పర్సన్ అయ్యారు. 2013లో ఆమె పార్టీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుని స్థాయికి ఎదిగారు. కాగా, రాష్ట్రపతిగా అభ్యర్థిగా ముర్మునే తొలి ఆదివాసీ మహిళ కావడం గమనార్హం.
Smt. Droupadi Murmu Ji has devoted her life to serving society and empowering the poor, downtrodden as well as the marginalised. She has rich administrative experience and had an outstanding gubernatorial tenure. I am confident she will be a great President of our nation.
— Narendra Modi (@narendramodi) June 21, 2022
దేశానికి గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారంటూ మోడీ ట్వీట్
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక కావడం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ద్రౌపది ముర్ము తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేశారని కొనియాడారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారత కోసమే కృషి చేశారన్నారు. ఆమెకు విశేష పరిపాలన అనుభవం ఉందన్నారు. ద్రౌపది ముర్ము మనదేశానికి గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారన్న విశ్వాసం ఉందని ప్రధాని మోడీ అన్నారు. విధానపరమైన అంశాలపై ఆమెకున్న అవగాహన, దయతో కూడిన ఆమె స్వభావం మనదేశానికి ఎంతో మేలు చేస్తుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications