చక్రం తిప్పిన రాజ్‌నాథ్: సొంత రాష్ట్రానికి 1000 ఆక్సిజన్ సిలిండర్లు: డీఆర్డీఓ నుంచి సప్లై
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా నమోదవుతున్నాయి. జనంపై పంజా విసురుతున్నాయి. ఏ ఒక్క రాష్ట్రం కూడా దీనికి మినహాయింపు కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా..అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను చూస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. వరుసగా రెండున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా 2,73,810 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మూడు లక్షల మార్క్‌ను దాటడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.
ఈ పరిస్థితుల్లో ఆసుపత్రులు చాలట్లేదు. ఆసుపత్రుల ఆవరణలో కరోనా రోగులకు వైద్య సేవలను అందించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, పంజాబ్.. ఇలా అనేక రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. కొత్త ప్లాంట్లను నెలకొల్పడానికి అనుమతులను జారీ చేసింది.

ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) కూడా రంగంలోకి దిగింది. వెయ్యి జంబో ఆక్సిజన్ సిలిండర్లను తయారు చేసింది. వాటిన్నింటినీ ఉత్తర ప్రదేశ్‌కు పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా తొలిదశలో 150 జంబో ఆక్సిజన్ సిలిండర్లను ఉత్తర ప్రదేశ్‌కు పంపిణీ చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాల మేరకు వాటిని ఉత్పత్తి చేసినట్లు డీఆర్డీఓ వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్.. రాజ్‌నాథ్ సింగ్ సొంత రాష్ట్రం. లక్నో లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. డీఆర్డీఓ ఇప్పుడు పంపిణీ చేసిన సిలిండర్లన్నింటినీ లక్నోలోని ఆసుపత్రులకు అందజేస్తుంది అక్కడి ప్రభుత్వం.












Click it and Unblock the Notifications