పంజాబ్ బోర్డర్ లో డ్రోన్ కలకలం.. జవాన్ల కాల్పులతో పలాయనం; డ్రోన్స్ పై జమ్మూలో స్థానికులకు శిక్షణ !!
భారత దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.ఎప్పుడు ఎటువైపు నుంచి డ్రోన్ దాడులు జరుగుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై దాడి జరిగిన తరువాత ఇప్పటి వరకూ నిత్యం డ్రోన్లు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా బుధవారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలోని బమియాల్ సెక్టార్‌లోని జైత్‌పూర్ పోస్ట్ సమీపంలో ఒక డ్రోన్ కలకలం సృష్టించింది.
బమియాల్ సెక్టార్‌లో కనిపించిన డ్రోన్, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
డ్రోన్ సంచరిస్తున్నట్లు గుర్తించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అలర్ట్ అయ్యారు. ఆర్మీ జవాన్లు డ్రోన్ పై కాల్పులు జరిపారు. నాలుగు నుండి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో డ్రోన్ అక్కడినుండి కనిపించకుండా పోయింది. దీంతో ఆ ప్రాంతంలో డ్రోన్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ డ్రోన్ ద్వారా ఏదైనా ఆయుధ సామాగ్రి చేరవేయబడుతుందా ? లేదా ఉగ్రవాదులకు ఏదైనా సందేశాన్ని పంపించబడుతుందా ? అంతర్జాతీయ స్మగ్లింగ్ కోసం డ్రోన్ ను పంపించారా? లేదా మరేదైనా దాడికి ప్లాన్ చేశారా ? అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.

ఇటీవల డ్రోన్ ద్వారా తరలించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా సిబ్బంది
గతంలో పఠాన్‌కోట్ ప్రాంతంలో భద్రతా సిబ్బందికి అనుమానాస్పదంగా ఒక బెలూన్ ఎగరడం కనిపించింది. ఆ తర్వాత నెల రోజులకు జమ్ము లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై డ్రోన్ దాడి జరిగింది. ఆ తర్వాత వరుసగా డ్రోన్లు ఎక్కడపడితే అక్కడ భారత భద్రతా దళాలకు చిరాకు కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా జమ్మూ జిల్లాలో పాకిస్థాన్ డ్రోన్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఉగ్రమూకకు చేరవేసే క్రమంలో భద్రతా సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక ఏకే-47 అస్సాల్ట్ రైఫిల్, మూడు AK మ్యాగజైన్‌లు, 30 AK రౌండ్లు మరియు ఓ టెలిస్కోప్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.
డ్రోన్ వ్యవస్థకు చెక్ పెట్టేలా .. స్థానికులకు ఆర్మీ శిక్షణ
ఈ డ్రోన్ వ్యవస్థను ఎదుర్కోవటం భారత్ కు పెద్ద ఇబ్బందిగా తయారైంది. భారత్ బోర్డర్ లో డ్రోన్ ల ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలు నిత్యకృత్యంగా మారడంతో దీనికి చెక్ పెట్టడానికి ఇండియన్ ఆర్మీ రెడీ అయింది. పాకిస్తాన్ వైపు నుండి పెరుగుతున్న బెదిరింపులను ఎదుర్కోవడానికి భద్రతా సంస్థలు సమగ్ర వ్యూహాలను రూపొందిస్తుండగా, జమ్మూలోని సరిహద్దు భద్రతా దళం (BSF) సరిహద్దు సమీపంలో నివసిస్తున్న పౌరులకు డ్రోన్ కార్యకలాపాల గురించి సకాలంలో అప్రమత్తం చేయడానికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. డ్రోన్ టెక్నిక్‌ల గురించి సరిహద్దు నివాసితులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారు తమ ప్రాంతంలో అలాంటి కార్యకలాపాలను చూసినప్పుడు, వారు ఎగిరే డ్రోన్స్ ను సులభంగా గుర్తించవచ్చని, అదే విషయాన్ని భద్రతా దళాల దృష్టికి తీసుకెళ్లవచ్చు అని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు.
డ్రోన్స్ ద్వారా దాడులు, స్మగ్లింగ్, ఉగ్రవాద కార్యాకలాపాలు; ఫోకస్ చేస్తున్న ఆర్మీ
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లోని ముఖ్యమైన సైనిక స్థావరాలు మరియు శిబిరాలను డ్రోన్‌ల ద్వారా లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా, డ్రోన్స్ తో ఈ ప్రాంతంలో ఆయుధాలు, నకిలీ కరెన్సీ మరియు మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడానికి నిరంతరం ఉపయోగిస్తోందని గుర్తించారు. ఒకపక్క యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకు వస్తూనే, మరోపక్క స్థానిక ప్రజలకు శిక్షణ ఇచ్చి డ్రోన్ల ద్వారా దాడులకు, డ్రోన్ల ద్వారా జరుగుతున్న ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ కు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీ పెద్ద ఎత్తున కృషి చేస్తోంది.












Click it and Unblock the Notifications