సెర్బియాలో సమంత- భారీ యాక్షన్ మూవీ: రాష్ట్రపతితో భేటీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్- సమంత నటిస్తోన్న అప్‌కమింగ్ మూవీ.. సిటాడెల్. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కుతోంది. ప్రస్తుతం సెర్బియాలో షూటింగ్ జరుపుకుంటోంది. రాజ్- డీకే దర్శకత్వాన్ని వహిస్తోన్నారు. రుస్సో బ్రదర్స్ ఏజీబీఓ మొదటిసారిగా ఈ థ్రిల్లర్ సిరీస్‌కు శ్రీకారం చుట్టింది. దీని తరువాత రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక చోప్రా లీడ్ క్యారెక్టర్స్‌లో నటించిన సిటాడెల్ సిరీస్ విడుదలైంది.
అదే పేరుతో ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తోన్నారు దర్శక ద్వయం రాజ్-డీకే. సెర్బియా మంచుకొండల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది యూనిట్. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు సెర్బియాలో మకాం వేశారు. రెండు వారాల పాటు ఇక్కడే షూటింగ్ జరుపుకోనుంది మూవీ.

కాగా- ఇవ్వాళ సెర్బియా పర్యటనకు వచ్చిన ద్రౌపది ముర్ముతో వరుణ్ ధావన్, సమంత సమావేశం అయ్యారు. ద్రౌపది ముర్ము సెర్బియా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆమెను మర్యాదపూరకంగా కలుసుకున్నారు. వరుణ్ ధావన్, సమంత, రాజ్ డీకే, ఇతర నటులు, టెక్నీషియన్లు రాష్ట్రపతి కలుసుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను వరుణ్ ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం సెర్బియా పర్యటనలో ఉన్నారు. సురినమె పర్యటనను ముగించుకున్న ఆమె బుధవారం రాత్రి సెర్బియాలో అడుగుపెట్టారు. భారత్- సెర్బియా మధ్య ఉన్న దౌత్యసంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు. బెల్‌గ్రేడ్‌లో ద్రౌపది ముర్ముకు ఆదేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్ సాదర స్వాగతం పలికారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో సైనిక వందనాన్ని స్వీకరించారు.
అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. సెర్బియాలోని భారత రాయబారి సంజీవ్ కోహ్లి ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసెప్షన్‌లో ప్రవాస భారతీయులతో సమావేశం అయ్యారు. భారత్- సెర్బియాలకు ప్రాచీన చరిత్ర ఉందని, అలీనోద్యమంలో ఈ రెండు దేశాలు క్రియాశీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల్లో సారూప్యత ఉందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications