ఆ అయిదు రాష్ట్రాల్లో రోడ్‌షోలపై కీలక నిర్ణయం: ఇంటింటి ప్రచారంపైనా ఆంక్షలు
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన తొలి విడత పోలింగ్ ఆరంభమౌతుంది. ఫిబ్రవరి 10,14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది. అదే నెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Recommended Video
అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న అయిదింట్లో.. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లల్లో ప్రస్తుతం కాషాయ జెండా ఎగురుతోంది. పంజాబ్‌ను కాంగ్రెస్ పరిపాలిస్తోంది. పంజాబ్‌ను హస్తగతం చేసుకోవడంతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ సర్వశక్తులను ఒడ్డుతోంది. విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

బీజేపీ దూకుడును నిలువరించడానికి అన్ని ప్రధాన ప్రతిపక్షాలు ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. తన అధికార పరిధిని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరింపజేసుకోవడానికి ఆమ్ఆద్మీ పార్టీ కసరత్తు చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే- ఢిల్లీని రోల్ మోడల్‌గా తీసుకుని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తామంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. పంజాబ్, గోవాలపై ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి పెట్టింది.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్నికల రోడ్ షో, భారీ ప్రదర్శనలపై ప్రస్తుతం అమలులో ఉన్న నిషేధాన్ని పొడిగించింది. ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అంటే అప్పటికి తొలివిడత పోలింగ్ ముగుస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు.
కాగా బహిరంగ సభలు, ఇండోర్ ఎన్నికల సమావేశాల్లో పాల్గొనే వారి సంఖ్యపై ఆంక్షలను విధించింది. బహిరంగ సభల్లో 1000 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదని ఆదేశించింది. ఇండోర్ ఎన్నికల సమావేశాల్లో పాల్గొనే వారి సంఖ్య 500లకు మించకూడదని స్పష్టం చేసింది. అలాగే- వివిధ పార్టీల నాయకులు చేపట్టే ఇంటింటి ప్రచారంపైనా ఆంక్షలను వర్తింపజేసింది. ఇంటింటి ప్రచారంలో 20 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదని స్పష్టం చేసింది.
ఇదివరకు ఈ సంఖ్య మరింత తక్కువగా ఉండేది. బహిరంగ సభలకు 500 మందికి మాత్రమే అనుమతి ఉండేది. ఈ సంఖ్యను వెయ్యికి పెంచింది. ఇండోర్ మీటింగ్స్‌కు 300 మందికి మాత్రమే పరిమితం చేయగా.. తాజాగా ఈ సంఖ్యను 500కు పెంచింది. ఇంటింటి ప్రచారంలో పాల్గొనే వారి సంఖ్యనూ రెట్టింపు చేసింది. ఇదివరకు 10 మందికి మాత్రమే అనుమతి ఉండేది. దీన్ని 20కి పెంచింది కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం.












Click it and Unblock the Notifications