ఏపీలో వారి లెక్క తేల్చిన కేంద్ర ఎన్నికల సంఘం
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో కొద్దిరోజులుగా నకిలీ ఓటర్ల జాబితా కలకలం రేపుతూ వస్తోంది. ఈ అంశంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య వాగ్వివాదాలు, మాటలదాడులు కొనసాగుతోన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటోన్నారు.
ఫేక్ ఓట్లను ఏరివేసే విషయంలో ఒక అడుగు ముందే ఉన్న వైఎస్ఆర్సీపీ ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం దృష్టికీ దీన్ని తీసుకెళ్లింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డితో కూడిన ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసింది.

అదే సమయంలో మాజీ మంత్రి పేర్ని నానితో కూడిన మరో బృందం ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి మరో రెప్రజెంటేషన్ అందజేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన పాపాల వల్లే ఏపీలో భారీగా నకిలీ ఓటర్లు ఉన్నారనేది వైసీపీ ప్రధాన ఆరోపణ.
ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో డూప్లికేట్ ఓటర్ల జాబితాను సృష్టించారని ముందు నుంచీ చెబుతూ వస్తోంది వైసీపీ. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్న నకిలీ ఓటర్లను తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాధారాలను కూడా ఎన్నికల ప్రధానాధికారికి అందజేసింది.
ఈ పరిణామాలన్నింటిపై తాజాగా ఈసీ స్పందించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం నకిలీ ఓటర్ల సంఖ్యను వెల్లడించింది. వాటిని తొలగించే చర్యలను చేపట్టినట్లు వివరించింది. ఈ మేరకు వైసీపీ తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు రాసిన లేఖకు బదులు ఇచ్చింది ఈసీ.
ఏపీలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదవుతున్నాయని, ఒకే ఇంటి నంబర్‌పై ఓట్లను చేర్చుతున్నారని ఆరోపిస్తూ రఘురామ ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అర్హులైన వారి ఓట్లను కూడా తొలగిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఆయన లేవనెత్తిన అంశాలపై ఈసీ తాజాగా బదులు ఇచ్చింది.
రాష్ట్రంలో 27,13,443 దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని ఈసీ తెలిపింది. సున్నా ఇంటి నంబర్‌పై 2,51,767 ఓట్లు ఉన్నాయని, అవన్నీ నకిలీవేనని నిర్ధారించినట్లు పేర్కొంది. ఒకే ఇంటి నంబర్‌పై 10, అంతకు మించి ఓట్లు కలిగి ఉన్న నివాసాలు 1,57,939 ఉన్నట్లు పేర్కొంది. ఒకే డోర్ నెంబర్‌పై 24,61,676 ఓట్లు ఉన్నట్టు గుర్తించినట్లు వివరించింది.












Click it and Unblock the Notifications