ఉలిక్కిపడ్డ ఫిల్మ్ ఇండస్ట్రీ..!!
మలయాళ చిత్ర పరిశ్రమలకు బిగ్ షాక్ తగిలింది. సూపర్ స్టార్ మమ్మూట్టి మొదలుకుని పలువురు హీరోలు ఇక్కట్లల్లో పడ్డారు. చట్టపరమైన ఉల్లంఘనలను ఎదుర్కొంటోన్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వారి ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ మెరుపుదాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో మలయాళ చిత్ర పరిశ్రమ మొత్తం ఉలిక్కిపడింది.
చెన్నైలో ఈ తెల్లవారు జాము నుంచి ఈ దాాడులు కొనసాగుతున్నాయి. కేరళలోని కొచ్చి యూనిట్ కు చెందిన ఈడీ అధికారులు ఈ దాడులు చేపట్టారు. దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి ఇళ్లలో దాడులు నిర్వహించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ దాడులను ఎదుర్కొంటోన్నారు. అమిత్ చకలక్కల్ సహా పలువురు మలయాళ సినీ సినీ ప్రముఖుల నివాసాలు, వ్యాపార సంస్థలు ఈడీ రాడార్ పరిధిలో ఉన్నాయి.

అక్రమంగా లగ్జరీ కార్లను కొనుగోలు చేశారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి సంబంధించిన నిర్మాణ సంస్థ వే- ఫేరర్ ఫిల్మ్స్‌పై తొలుత తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో చెన్నై గ్రీన్ వేస్ రోడ్‌లో ఉన్న మమ్ముట్టికి చెందిన ఇతర కార్యాలయాలపైనా ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో ఎనిమిది మంది ఈడీ అధికారులతో పాటు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
కేరళ, తమిళనాడులోని 17 ప్రాంతాల్లో ఈడీ కొచ్చి జోనల్ కార్యాలయం చేపట్టిన విస్తృత దాడులలో భాగంగా ఈ తనిఖీలు సాగుతున్నాయి. లగ్జరీ వాహనాల అక్రమ రవాణా, అనధికార విదేశీ మారక ద్రవ్య లావాదేవీలకు సంబంధించిన విచారణలో భాగంగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయా హీరోలు, ఇతర నటులు, దర్శకులు, నిర్మాతల వాహనాలు, కేరళకు చెందిన టాప్ ఆటో వర్క్‌షాప్‌లు, వ్యాపారులకు చెందిన సంస్థలు ఈడీ జాబితాలో ఉన్నాయి.
ఎర్నాకులం, త్రిసూర్, కోజికోడ్, మలప్పురం, కొట్టాయం, కోయంబత్తూర్ వంటి ప్రాంతాల్లోనూ ఈ సోదాలు జరిగాయి. భారత సైన్యం అమెరికా రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖలతో సంబంధాలున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి కోయంబత్తూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ నెట్‌వర్క్ ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ నకిలీ పత్రాలతో వాహనాల రిజిస్ట్రేషన్లు పొందారు. ఈ లగ్జరీ వాహనాలను సినీ ప్రముఖులతో సహా ధనవంతులకు తక్కువ ధరలకు విక్రయించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.












Click it and Unblock the Notifications